Share News

Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2023-12-06T10:54:47+05:30 IST

ఛత్తీస్ గఢ్(Chattisgarh)లో సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) నిందితుడు అసిమ్ దాస్ తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది.

Betting App: మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి

రాయ్ పుర్: ఛత్తీస్ గఢ్(Chattisgarh)లో సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) నిందితుడు అసిమ్ దాస్ తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది. దుర్గ్(Durgh District) జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సుశీల్ దాస్(62) రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మహదేవ్ యాప్ స్కామ్ లో నిందితుడి తండ్రి.

అతను రెండు రోజుల క్రితం కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అచ్చోటి గ్రామంలోని ఓ బావిలో సుశీల్ మృతదేహాన్ని గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని దుర్గ్ పోలీస్ అధికారి రామ్ గోపాల్ గార్గ్ తెలిపారు.

ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న దాస్ ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారని చెప్పారు. అయితే ఆయన సూసైడ్ వెనుక కచ్చితమైన కారణం తెలియరాలేదని వెల్లడించారు.


పోస్టు మార్టం నివేదిక ఆధారంగా మృతిపై కచ్చితమైన నిర్ధారణ వస్తుందని వెల్లడించారు. అసిమ్ దాస్, భీమ్ సింగ్ యాదవ్ లను మహదేవ్ బెట్టింగ్ యాప్ లో నిందితులుగా పేర్కొంటూ ఈడీ నవంబర్ 3న అరెస్టు చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఇప్పటివరకు ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కు రూ.508 కోట్లు చెల్లించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే బఘేల్ ఈ ఆరోపణల్ని ఖండించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. రాయ్ పుర్ లో ఈడీ(ED) అసిమ్ దాస్ ను అరెస్టు చేసి రూ.5.39 కోట్లను స్వాధీనం చేసుకుంది. బెట్టింగ్ నిధుల్ని ఛత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ వాడుకుందని బీజేపీ ఆరోపిస్తూ వచ్చింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ ఘోర పరాజయాన్ని ముటగట్టుకుంది. ఇదే టైంలో నిందితుడు అసిమ్ దాస్ తండ్రి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Updated Date - 2023-12-06T10:55:24+05:30 IST