Kandi forest: ఐదుగురు భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు
ABN , First Publish Date - 2023-05-05T18:03:03+05:30 IST
జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.
రాజౌరి: జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరీ (Rajouri) కాండి అటవీ ప్రాంతంలో (Kandi forest) ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్ జరుగుతుండగా భద్రతా బలగాలపై బాంబు విసిరారు. ఈ పేలుడులో ఐదుగురు భారత జవాన్లు (Five Army jawans) అమరులయ్యారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పలువురు జవాన్లు గాయపడ్డారని సమాచారం.
జమ్మూకశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఇటీవలే పూంచ్ ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై మెరుపుదాడి చేసి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టుకున్నాయి. శ్రీనగర్‌లో జరగనున్న జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని వ్యతిరేకించిన లష్కరే తాయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ ఈ దాడి జరిపింది. ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. 2019లో అల్ ఖాయిదా ప్రేరణతో పురుడుపోసుకున్న ఈ ఉగ్రసంస్థ.. జైషే మహమ్మద్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ రిక్రూట్‌మెంట్లకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ పాత్ర ఉండడం, దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు కుట్రలు పన్నడంతో కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరిలో ఈ సంస్థపై నిషేధం విధించింది.