Delhi: విమానం ఆలస్యం కావడంతో ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికుల గొడవ.. ఎయిర్ లైన్స్ ఏం చెప్పిందంటే?
ABN , First Publish Date - 2023-12-02T14:23:36+05:30 IST
విమానం ఆలస్యం కావడంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్(Delhi Airport)లో సిబ్బందితో గొడవకు దిగారు ప్రయాణికులు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీ: విమానం ఆలస్యం కావడంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్(Delhi Airport)లో సిబ్బందితో గొడవకు దిగారు ప్రయాణికులు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పైస్ జెట్‌కు చెందిన ఎస్‌జీ-8791 విమానం ఢిల్లీ నుంచి పట్నా వెళ్లాలి. నిన్న ఉదయం 8 గంటలకు ఢిల్లీకి చేరుకోవాలి. కానీ ఏకంగా 7 గంటలు ఆలస్యంగా ఎయిర్ పోర్ట్ కి వచ్చింది. అప్పటికే ఎంతో ఒప్పిగ్గా ఎదురు చూసిన ప్రయాణికులు సహనాన్ని కోల్పోయారు.
విమానాశ్రయ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఆలస్యం గురించి తమకు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో గందరగోళం నెలకొంది. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణికులకు సర్ది చెప్పారు. ఈ ఇష్యూపై స్పందించిన ఎయిర్ లైన్స్ నిన్న రాత్రి విమానం వేళల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని తెలిపింది.
అయితే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ప్రయాణికులకు చేరవేశామని చెబుతోంది. సమాచారం పంపి అందుకు తగినవిధంగా ప్రయాణ సమయాల్ని షెడ్యూల్ చేసుకోవాలని కోరినట్లు తెలిపింది. ప్రయాణికుల నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో, స్పైస్‌జెట్ ఉద్యోగిపై మహిళా ప్రయాణికురాలు అరుస్తున్న వీడియో చిత్రీకరించడం వైరల్ అయ్యింది. అది కూడా విమానం ఆలస్యం కావడానికి సంబంధించినదే కావడం గమనార్హం.