Former CM: జీఎస్టీ రిటర్న్స్ సమర్పించే వ్యవధి పెంపు సరికాదు
ABN , First Publish Date - 2023-07-15T11:32:58+05:30 IST
జీఎస్టీ రిటర్న్స్ సమర్పించేందుకు ఉన్న అవధిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచడం సరికాదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Ch
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): జీఎస్టీ రిటర్న్స్ సమర్పించేందుకు ఉన్న అవధిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచడం సరికాదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) అభిప్రాయపడ్డారు. శాసనసభలో శుక్రవారం పలు బిల్లులపై జరిగిన చర్చలో పాల్గొని ప్రసంగించారు. సరుకు రవాణా, సేవలు దేశవ్యాప్తంగా ఏకరూప విధానాన్ని కలిగి ఉండాలన్న ఉద్దేశ్యంతోనే 2017లో రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీని అమలులోకి తెచ్చిన సంగతిని గుర్తు చేశారు. మూడేళ్లకు పెంచడం వల్ల ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందన్నారు. జీఎస్టీ పన్ను వసూళ్లలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. వ్యాపారులపాలిట జీఎస్టీ విధానం ఎంతో సులభంగా, సరళంగా ఉందని తెలిపారు. పన్నుల ఎగవేత కేసులు అధికంగా ఉన్నాయని, వీటిని నియంత్రించేందుకు ప్రతి యేటా జీఎస్టీ రిటర్న్స్ సమర్పించడమే సహేతుకమన్నారు. ఇదే సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు రూ.కోటిలోపు పనులకు సంబంధించి టెండర్ల నుంచి మినహాయింపు ఇవ్వడం హర్షదాయకమన్నారు. ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.50లక్షల నుంచి కోటికి పెంచడాన్ని స్వాగతించారు. నూతన చట్టాలు అమలులోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లలో ఉత్సాహం ఉరకలు వేస్తోందన్నారు. పన్నుల వసూళ్లు, అభివృద్ధి వంటి అంశాలలో ప్రతిపక్షాలు చేసే సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరారు.
జయచంద్రకు ఢిల్లీ బాధ్యతలు సరికాదేమో...
శాసనసభలో అత్యంత సీనియర్ సభ్యుడైన మాజీ మంత్రి టీబీ జయచంద్రను ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం సరికాదేమోనని మాజీ సీఎం బొమ్మై అభిప్రాయపడ్డారు. వయోభారం రీత్యా ఢిల్లీలో ఎముకలు కొరికే చలిని ఆయన తట్టుకోవడం కష్టమన్నారు. శాసనసభలో తానే సీనియర్‌నని సిద్దరామయ్య అంటున్నారని, నిజానికి 1978లోనే టీబీ జయచంద్ర శాసనసభకు ఎన్నికైన సంగతిని గుర్తు చేశారు. ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఔత్సాహికుడైన యువ ఎమ్మెల్యేను నియమిస్తే బాగుంటుందన్నారు.