Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఉనికి కోసమే ప్రతిపక్షాల పాట్లు, నక్కలన్నీ ఒకేచోట చేరాయి
ABN , First Publish Date - 2023-07-18T12:31:17+05:30 IST
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, వారి బెంగళూరు సమావేశంతో ఒరిగేదేమీ లే
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, వారి బెంగళూరు సమావేశంతో ఒరిగేదేమీ లేదని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఉనికిని కాపాడుకునేందుకే ప్రతిపక్షాలు బెంగళూరులో షో చేస్తున్నాయని తెలిపారు. యూపీఏ మిత్రకూటమి ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని, ఇందులోని ప్రధాన పక్షమైన కాంగ్రెస్ పరిస్థితి అనేక రాష్ట్రాల్లో అధోపతనానికి చేరిందని ఆయన గుర్తు చేశారు. విశ్వగురుగా ప్రధాని నరేంద్రమోదీకి లభిస్తున్న ఆదరణను ప్రతిపక్షాలు చూసి సహించలేకపోతున్నాయన్నారు. కేంద్రంలోని గత 9 సంవత్సరాల ఎన్డీయే పాలనలో దేశం గణనీయ ఆర్థిక ప్రగతిని సాధించిందని విద్యా, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని బొమ్మై అన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా మోదీ ఎంతగానో చొరవ తీసుకున్నారన్నారు. ఉచిత పథకాలతో అభివృద్ధి కుంటుపడుతుందని పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో నెలకొన్న పరిస్థితే ఇందుకు తార్కాణమని బొమ్మై అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మళ్లీ 25కు పైగా స్థానాలను గెలుచుకోవడం ఖాయమని, కాంగ్రెస్కు గట్టి ఎదురు దెబ్బలు తప్పవని ఆయన జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయేకు మళ్లీ అధికారం తథ్యమని నరేంద్రమోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు.
నక్కలన్నీ ఒకే చోట చేరాయి: సీటీ రవి
నక్కలన్నీ తమ స్వార్థ రాజకీయ అజెండాతో ఒకేచోట చేరాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి పేర్కొన్నారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నక్కజిత్తులేవీ సింహం ముందు పనిచేయవన్నారు. ప్రపంచమంతా ప్రధాని మోదీని వేనోళ్లా కొనియాడుతుంటూ ప్రతిపక్షాలు మాత్రం కళ్లలో నిప్పులు వేసుకుంటూ ఆయనను నిందిస్తున్నాయని రవి ఆక్రోశం వ్యక్తం చేశారు.