Former CM: కర్ణాటక మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఐదు నెలల్లో రాజకీయ ముఖచిత్రం మొత్తం..
ABN , First Publish Date - 2023-05-26T13:25:35+05:30 IST
రానున్న 5 నెలల్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోనుందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Former Chief Minister Basavaraja Bommai)
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రానున్న 5 నెలల్లో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోనుందని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Former Chief Minister Basavaraja Bommai) జోస్యం చెప్పారు. హావేరి జిల్లాలోని శిగ్గాంవ్‌లో గురువారం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇదే సందర్భంగా బొమ్మైను స్థానిక నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రసంగించిన ఆయన ప్రజలు మెచ్చేలా పాలన చేయాలని కాంగ్రెస్కు హితవు పలికారు. ప్రస్తుతం ప్రభుత్వం పయనిస్తున్న మార్గం చూస్తుంటే ఏదో ఒక నిర్దిష్టమతం ప్రజలను బుజ్జగించే ప్రయత్నమేనని తనకు అనిపిస్తోందన్నారు. అవసరమైతే ఆర్ఎస్ఎస్ను నిషేధిస్తామని మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ దమ్మూ ధైర్యం సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తున్న ఎస్‌డీపీఐని ముందుగా నిషేధించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రజలు అధికారం అప్పగించారు కదా అని అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం సహించే ప్రశ్నేలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నికులాలు, మతాల ప్రజలు తనపై విశ్వాసం ఉంచి గెలిపించారని వారి రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25కు పైగా స్ధానాల్లో విజయం సాధించడం, నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.