Former CM: సుమోటోగా మాజీసీఎం అక్రమార్జన కేసు
ABN , First Publish Date - 2023-09-01T08:54:54+05:30 IST
అక్రమార్జన కేసు నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam)ను దిగువ కోర్టు విడుదల చేయడాన్ని
చెన్నై, (ఆంధ్రజ్యోతి): అక్రమార్జన కేసు నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam)ను దిగువ కోర్టు విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మద్రాస్ హైకోర్టు... ఆ కేసు పునర్విచారణను సుమోటోగా స్వీకరించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2001-06 వరకు జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రెవెన్యూశాఖ మంత్రిగా కొనసాగిన ఓపీఎస్.. ఆదాయానికి మించి రూ.1.77 కోట్ల మేరకు అక్రమంగా అర్జించినట్లు 2006లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వ హయాంలో అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఓపీఎస్, ఆయన సతీమణి విజయలక్ష్మి, కుమారుడు రవీంద్రనాథ్ తదితర ఆరుగురిపై చార్జిషీట్లు దాఖలయ్యాయి. అప్పట్లో ఈ కేసు విచారణను మదురై నుంచి శివగంగ కోర్టుకు బదిలీ చేశారు. ఏళ్లతరబడి ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. చివరకు 2011లో అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి రాగానే ఓపీఎ్‌సపై అక్రమార్జన కేసుపై విచారణ జరిపేందుకు ఇచ్చిన అనుమతిని జయ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. దీంతో నిందితులపై ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లభించలేదంటూ ఏసీబీ అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా శివగంగ కోర్టు 2012లో ఓపీఎస్ తదితరులను నిర్దోషులుగా ప్రకటించింది. శివగంగ కోర్టు తీర్పు వెలువడిన 11 యేళ్ల తర్వాత ఆ కోర్టు తీర్పును పునఃసమీక్ష చేసి సుమోటోగా పునర్విచారణ జరపాలని న్యాయమూర్తి ఎన్.ఆనంద్ వెంకటేష్ నిర్ణయించారు. ఈ కేసు విచారణ గురువారం ఉదయం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను పునఃసమీక్ష జరుపుతామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత ఆ పక్షాలు అధికారంలోకి రాగానే కేసులు రద్దు కావడం ఆనవాయితీగా మారిందన్నారు. ఏసీబీ అధికారుల వైఖరి కూడా పాలక పక్షానికి అనుగుణంగా మారుతుండడం గర్హనీయమ న్నారు. ఓపీఎస్(OPS) అక్రమార్జన కేసులో 274 మంది సాక్షుల వద్ద విచారణ జరిపి 235కు పైగా ఆధారాలు సమర్పించిన ఏసీబీ అధికారులు.. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే కేసును పక్కదోవ పట్టించడంతోపాటు నిందితులు విడుదలయ్యేందుకు కూడా సహకరించారని దుయ్యబట్టారు. ఈ కేసులో అప్పటి స్పీకర్ కూడా ఓపీఎస్‌పై విచారణ జరిపేందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునే వ్యవహారంలో జడ్జిలా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగువ కోర్టుల తీర్పులపై 12 యేళ్లు గడిచినా పునర్విచారణ జరిపేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగానే ఓపీఎస్ అక్రమార్జన కేసును పునర్విచారణ జరుపుతామని ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పష్టం చేశారు.