Karnataka : కర్ణాటక ఎన్నికల ముందు బీజేపీకి ఊహించని షాక్..
ABN , First Publish Date - 2023-04-16T12:37:45+05:30 IST
కర్ణాటక శాసన సభ ఎన్నికల తరుణంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది..
బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల తరుణంలో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టార్ (Former Karnataka CM and senior leader Jagadish Shettar) ఎమ్మెల్యే పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. మే 10న ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆయన రాజీనామా వల్ల బీజేపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెప్తున్నారు. ఆయన కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు శాసన సభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు.
ఈ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని షెట్టార్ శనివారం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మైని కలిసిన తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.
త్వరలో నిర్ణయం
షెట్టార్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, బీజేపీ సీనియర్ నేతలు తనను తీవ్రంగా అవమానించారని చెప్పారు. పార్టీకి రాజీనామా చేయాలనే తన నిర్ణయం సుస్పష్టమని తెలిపారు. తాను తుది నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆదివారమే తాను రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానన్నారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నదీ ఆయన వెల్లడించలేదు. కొద్ది రోజుల నుంచి బీజేపీ నేతలు తన పట్ల వ్యవహరిస్తున్న తీరు తనకు తీవ్ర అవమానకరమని మాత్రమే చెప్పారు. పార్టీ నేతలు తనను కించపరచినందువల్లే తాను రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాష్ట్రంలోని కొందరు నేతలు బీజేపీ వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారన్నారు. ఏదైనా పార్టీలో చేరడమా? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమా? అనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నానని తెలిపారు. ఆయన గత ఎన్నికల్లో హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
పార్టీకి అతీతుడనే భావం
ఇదిలావుండగా, బీజేపీ ఉన్నత స్థాయి వర్గాలు స్పందిస్తూ, షెట్టార్ పార్టీ కన్నా తనకు తాను పెద్ద పీట వేసుకున్నారని చెప్పాయి. తాను పార్టీ కన్నా గొప్పవాడిననే భావంతో ఆయన వ్యవహరించారని తెలిపాయి. బీజేపీ పెద్దలు ఆయనతో మాట్లాడటానికి అనేకసార్లు ప్రయత్నించినట్లు తెలిపాయి. ఆయనకు పార్టీ అనేక ఆప్షన్స్ ఇచ్చిందని తెలిపాయి.
చర్చలు విఫలం
కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శనివారం షెట్టార్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మరో బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషీ కూడా పాల్గొన్నారు. హుబ్బళి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ విషయంలో షెట్టార్ అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
రాజీనామాల పర్వం
ఇదిలావుండగా, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఒకప్పటి జనతాపరివార్‌కు చెందిన ప్రముఖ నేత బీ సోమశేఖర్ (B Somasekhar) శనివారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళినికుమార్ కటీలు (Nalinikumar Katilu)కు పంపారు.
ఇవి కూడా చదవండి :
MS Dhoni: వీరాభిమానిని కలిసిన ధోనీ.. మురిసిపోయిన ఖుష్బూ.. ఆమె ట్వీట్ వైరల్!
Delhi Liquor Case : రాజ్‌ఘాట్‌కు కేజ్రీవాల్