Former Prime Minister: దమ్ముంటే ఆ ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి..
ABN , First Publish Date - 2023-08-29T10:35:04+05:30 IST
జేడీఎస్‌ను పలువురు ఎమ్మెల్యేలు త్వరలో వీడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని దళపతి, మాజీ ప్రధాని
- కాంగ్రెస్ నేతలకు మాజీ ప్రధాని దేవెగౌడ సవాల్
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): జేడీఎస్‌ను పలువురు ఎమ్మెల్యేలు త్వరలో వీడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని దళపతి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ(Former Prime Minister HD Deve Gowda) తీవ్రంగా ఖండించారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసే అంశంపైనే దృష్టి సారించానని పేర్కొన్నారు. అనారోగ్యాన్ని, వయోభారాన్ని సైతం లెక్కించక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని తీర్మానించానన్నారు. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎదురైన ఓటమి తాత్కాలికమేనని చెప్పారు. ఎక్కడ ఓడామో అక్కడే గెలిచి చూపిస్తామని తెలిపారు. జేడీఎస్ వంటి ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కాపాడడం సాధ్యమని చెప్పారు. జేడీఎ్‌సను బలహీన పరచాలని జరిగే ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించబోవన్నారు. సెప్టెంబరు 10న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో కార్యకర్తలు, అభిమానుల భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో తన తీర్మానాల కారణంగా ఏ ఒక్క కార్యకర్త మనసు నొచ్చుకున్నా అందుకు బహిరంగ క్షమాపణ చెబుతున్నా అన్నారు. ఇటీవలే పార్టీ కోర్ కమిటీని ఏర్పాటు చేశామని, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించామన్నారు. కుమారస్వామి నాయకత్వంలోనే పార్టీ కార్యకలాపాలు ఇక ముందు కూడా కొనసాగుతాయని తేల్చి చెప్పారు. బీజేపీతో పొత్తు గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులివ్వకుండా దాటవేశారు.
సిద్ధాంతాలు నమ్మివస్తే ఓకే: సీఎం
రాష్ట్రంలో ప్రతిపక్షాలైన జేడీఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ సిద్ధాంతాలను విశ్వసించి ముందుకొచ్చే పక్షంలో వారిని చేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. మైసూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరేందుకు స్వచ్ఛందంగా వచ్చేవారిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ దివాళా తీసిందన్నారు. కనీసం ప్రతిపక్షనేతలను ఎన్నుకోలేని దుస్థితిలో ఉన్న ఆ పార్టీ తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శాసనసభ చరిత్రలోనే ఇలాంటి ఘట్టం గతంలో ఎన్నడూ జరగలేదం టూ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ నగరంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ హస్త పేరు చెబితేనే బీజేపీ, జేడీఎస్‌లో ఎందుకు వణుకు ప్రారంభమైందో అర్థం కావడం లేదన్నారు. గతంలో ఆపరేషన్ కమల ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైనప్పుడు ఆపరేషన్ హస్త ఎందుకు కాకూడదని ఆయన ఎదురు ప్రశ్న వేశారు.
బీజేపీని వీడను : శంకర్ పాటిల్ మునేనకొప్ప
తాను బీజేపీని వీడే ప్రశ్నే లేదని మాజీ మంత్రి శంకర్‌పాటిల్ మునేనకొప్ప తేల్చి చెప్పారు. హుబ్బళ్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రె్‌సలో చేరాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గానీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్యగానీ, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌గానీ తనను ఆహ్వానించలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి తనకు లేదని చెప్పారు. రానున్న రోజుల్లో ఒకవేళ రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే జిల్లాలోని మొత్తం 8 తాలూకాల నేతలతో చర్చించాకే ముందడుగు వేస్తానని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, జగదీశ్‌శెట్టర్ రాజకీయ జన్మనిచ్చారని, వారికి సదా రుణపడి ఉంటానన్నారు.