G20 Ministers Meet : ఆర్థికాభివృద్ధికి గొప్ప సంపద పూర్వ సంస్కృతి : మోదీ
ABN , First Publish Date - 2023-08-26T15:53:14+05:30 IST
పూర్వ సంస్కృతికి భౌతిక విలువ ఉందని, అంతేకాకుండా అది దేశ చరిత్ర, గుర్తింపు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. తమ సాంస్కృతిక వారసత్వ సంపదకు చేరువై, ఆస్వాదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.
వారణాసి : పూర్వ సంస్కృతికి భౌతిక విలువ ఉందని, అంతేకాకుండా అది దేశ చరిత్ర, గుర్తింపు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. తమ సాంస్కృతిక వారసత్వ సంపదకు చేరువై, ఆస్వాదించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. సాంస్కృతిక వారసత్వం అంటే కేవలం శిలలపై చెక్కినది మాత్రమే కాదని, తరతరాల నుంచి వస్తున్న ఆచార, సంప్రదాయాలు; పండుగలు కూడానని తెలిపారు. వారణాసిలో జరిగిన జీ20 దేశాల సాంస్కృతిక శాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్ విధానంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వారణాసి (కాశీ)లో ఈ సమావేశం జరుగుతున్నందుకు మోదీ హర్షం వ్యక్తం చేశారు. కాశీ అంటే విజ్ఞానం, కర్తవ్యం, సత్యం యొక్క ఖజానా అని అందరికీ తెలుసునని చెప్పారు. ఇది భారత దేశానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పారు. గంగా నది వద్ద గంగమ్మ తల్లికి హారతి కార్యక్రమంలో పాల్గొనాలని అతిథులందరినీ కోరారు. కాశీలో లభించే నోరూరించే రుచికరమైన వంటకాలను రుచి చూడాలని కోరారు.
ప్రజలను సమైక్యపరిచే సత్తా సంస్కృతికి ఉందన్నారు. భారత దేశంలో ప్రాచీన, వైవిద్ధ్యభరితమైన సంస్కృతి ఉందని, అది తమకు గర్వకారణమని తెలిపారు. పైకి కనిపించని సాంస్కృతిక వారసత్వ సంపదకు కూడా తాము గొప్ప విలువ ఇస్తామని చెప్పారు. వారసత్వంగా వస్తున్న పూర్వ సంస్కృతికి సంబంధించిన ప్రదేశాలను పునరుద్ధరించి, కాపాడుకోవడం కోసం భారత దేశం కృషి చేస్తోందన్నారు.
వైవిద్ధ్యానికి, ఆర్థికాభివృద్ధికి పూర్వ సంస్కృతి వారసత్వం చాలా ముఖ్యమైన సంపద అని తెలిపారు. వారసత్వంగా వస్తున్న సంస్కృతితోపాటు అభివృద్ధి సాధించాలనేది భారత దేశ మంత్రమని తెలిపారు.
‘‘సంస్కృతి అందరినీ కలుపుతుంది’’ అనే కార్యక్రమాన్ని జీ20 సాంస్కృతిక మంత్రులు ప్రారంభించినట్లు తెలిపారు. ‘‘వసుధైక కుటుంబకం, ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ స్ఫూర్తితో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. ‘‘సంస్కృతి, సృజనాత్మకత, వాణిజ్యం, సహకారం అనే నాలుగింటి ప్రాధాన్యాన్ని మీ కృషి ప్రతిఫలిస్తుంది. దయామయ, సమ్మిళిత, శాంతియుత భవిష్యత్తును నిర్మించేందుకు సంస్కృతి యొక్క శక్తిని వినియోగించుకోవడానికి అది దోహదపడుతుంది’’ అని చెప్పారు.
జీ20 కల్చర్ గ్రూప్ సమావేశాల్లో ప్రధానంగా నాలుగు అంశాలపై ఏకాభిప్రాయం వస్తోంది. వీటిలో ఒక అంశం ఏమిటంటే, వారసత్వ సంపద (heritage)ను పునరుద్ధరించడం, పరిరక్షించడం.
మన దేశంలో దొంగతనానికి గురై, ఇతర దేశాలకు అనేక కళాకృతులు తరలిపోయాయి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచి 2014 వరకు వీటిలో కేవలం 13 కళాకృతులను మాత్రమే తిరిగి తీసుకొచ్చారని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో దాదాపు 230 కళాకృతులను తిరిగి తీసుకొచ్చినట్లు తెలిపింది. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా సహా విదేశాల నుంచి ఈ కళాఖండాలను తీసుకొచ్చినట్లు వివరించింది. మరో 200 కళాకృతులను తీసుకురావడానికి కృషి జరుగుతోందని తెలిపింది. వీటిలో దేవుని విగ్రహాలు, ఇతర సాంస్కృతిక సంబంధిత వస్తువులు ఉన్నాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయోత్సవాలు.. ఇస్రో శాస్త్రవేత్తల సమక్షంలో మోదీ భావోద్వేగం..
Smart Cities Awards : ఇండోర్ అత్యుత్తమ స్మార్ట్ సిటీ.. మధ్య ప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రం..