Share News

Gaumutra remarks: నిన్నటి వివాదాస్పద వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ విచారం

ABN , First Publish Date - 2023-12-06T14:46:18+05:30 IST

ఉత్తరాది రాష్ట్రాలను 'గోమూత్ర' రాష్ట్రాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్ పార్లమెంటుకు బుధవారంనాడు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి తన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా సభాపతిని కోరారు.

Gaumutra remarks: నిన్నటి వివాదాస్పద వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ విచారం

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలను 'గోమూత్ర' రాష్ట్రాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే (DMK) ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్ (DNV Senthil kumar) పార్లమెంటుకు బుధవారంనాడు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి తన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా సభాపతిని కోరారు.


జమ్మూకశ్మీర్‌కు చెందిన రెండు బిల్లులపై లోక్‌సభలో మంగళవారంనాడు జరిగిన చర్యలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ గెలిచిన రాష్ట్రాలు హిందీ బెల్ట్‌లో ఉన్నవేనని, వీటిని సహజంగా గోమూత్ర రాష్ట్రాలుగా పిలుస్తామని అన్నారు. బీజేపీ దక్షిణాదికి రాలేదని, అక్కడ ఎలాగూ అడుగు మోపలేరు కాబట్టి ఆయా రాష్ట్రాలను కేంద్ర పాలిత రాష్ట్రాలు చేస్తారనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై అటు బీజేపీ సభ్యులు మండిపడగా, డీఎంకే భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ సైతం క్షమాపణ చెప్పాలని ఆయనకు సూచించింది. ఈ నేపథ్యంలో సెంథిల్ కుమార్ లోక్‌సభలో క్షమాపణలు తెలిపారు.


''నిన్న సభలో చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు. అయితే తన వ్యాఖ్యలు కొందరు వ్యక్తులు, వర్గాల ప్రజల మనోభావాలను గాయపరిచి ఉంటే వాటిని ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నారు. నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నాను'' సెంథిల్ కుమార్ లోక్‌సభకు తెలిపారు.


స్టాలిన్ మందలింపు..

లోక్‌సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన సెంథిల్ కుమార్‌ను డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మందలించినట్టు ఆ పార్టీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు హుందాగా వ్యవహారించాల్సిన అవసరాన్ని పార్టీ పదేపదే చెబుతుంటుందని తెలిపింది. 'ఇండియా' బ్లాక్ కూటమిలో ఉన్న పలువురు నేతలు కూడా డీఎంకే ఎంపీ వ్యాఖ్యలను ఖండించాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇష్టానికి అనుగుణంగా ఓటు వేస్తారని, వారిని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. సెంథిల్ కుమార్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి, వాటిని ఉపసంహరించుకోవాలి కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు కార్తీ చిదంబరంలో మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-12-06T14:46:19+05:30 IST