Godhra Train Burning: గోద్రా రైలు దహనం కేసులో 8 మంది దోషులకు సుప్రీంకోర్టు బెయిలు

ABN , First Publish Date - 2023-04-21T15:57:21+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 గోద్రా రైలు దహనం కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు బెయిల్..

Godhra Train Burning: గోద్రా రైలు దహనం కేసులో 8 మంది దోషులకు సుప్రీంకోర్టు బెయిలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 గోద్రా రైలు దహనం (Godhra Train Burning) కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. మరణశిక్ష పడిన నలుగురికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. సెషన్స్ కోర్టు విధించిన షరతులకు లోబడి 8 మంది దోషులకు సీజేఐ (CJI) డీవీ చంద్రచూడ్ (DY Chandrachud), జస్టిస్ పీఎస్ నరసింహ (PS Narasimha)తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

గోద్రా రైలు దహనం కేసులో దోషులు దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు వివరాలు కోరింది. ఈ కేసులో దోషుల వయస్సు, జైలులో ఎన్నేళ్లు గడిపారనే వివరాలను కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. ఈ కేసులో 11 మందికి విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తూ గుజరాత్ హైకోర్టు 2017 తీసుకున్న నిర్ణయంతో గుజరాత్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా విభేదించారు. విచారణ కోర్టు 20 మంది దోషులకు యవజ్జీవ ఖైదు, 11 మంది దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిందని, ఆ తర్వాత 11 మంది మరణశిక్షను జీవిత ఖైదుగా హైకోర్టు తగ్గించిందని కోర్టుకు మెహతా వివరించారు.

ఈ కేసులో సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే తన వాదన వినిపిస్తూ, ఈ కేసులో కొందరు దోషులు ఇప్పుడు 60 ఏళ్లలో ఉన్నారని, కేసులో 11 మందిపై విచారణ కోర్టు విధించిన మరణశిక్ష ఆమోదయోగ్యమైనదా, కాదా అనే దానిపై కోర్టు నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీనియర్ అడ్వకేట్ కేటీఎల్ తులసి తన వాదనను కోర్టుకు వివరిస్తూ, నిందితుల్లో ఒకరైన బిలాల్ ఇస్మైల్‌కు గుజరాతీ తెలియదని, డాక్యుమెంట్‌లోని వివరాలు ఏమాత్రం తెలియకుండానే ఆయన తన వేలిముద్ర వేశారని చెప్పారు. కాగా, 2002 గోద్రా రైలు దహనం కేసులోని 31 మంది దోషుల్లో ఒకరికి గత డిసెంబర్‌లో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. గోద్రా రైలు దహనంతో గుజరాత్‌లో మత ఘర్షణలు చెలరేగి ఈ అల్లర్లలో సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2023-04-21T15:57:21+05:30 IST