Tomato Price: టమాటా ధరలపై కేంద్రం కీలక ఆదేశాలు.. రేపటి నుంచి కిలో..
ABN , First Publish Date - 2023-08-19T17:43:36+05:30 IST
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్ట్ 20 (ఆదివారం) నుంచి కేజీ టమాటాను 40 రూపాయలకు విక్రయించాలని నేషనల్ కో-ఆపరేటివ్ కన్య్సూమర్స్ ఫెడరేషన్‌కు (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
న్యూఢిల్లీ: కనీవిని ఎరుగని రీతిలో కేజీ రూ.200 పలికిన టమాటాలు మెల్లమెల్లగా దిగివస్తూ వినియోగదారులకు ఊరట కలిగిస్తున్నాయి. గత రెండు నెలలుగా టమాటాలను సామాన్యులు మరచి పోయారు. అరకొరగా రైతు బజారులో అప్పుడప్పుడు కేజీ రూ.50కి ఇచ్చినా అవి ఎటూ సరిపోలేదు. ఇప్పుడు కొత్త పంటలు రావడంతో మెల్లిమెల్లిగా దిగివస్తూ కిలో రూ.50కి చేరుకున్నాయి. ఇంకా రెండు, మూడు రోజుల్లో కిలో రూ.30కి వచ్చే అవకాశాలున్నాయని రైతులు చెబుతున్నారు. త్వరలోనే గతంలోలా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్ట్ 20 (ఆదివారం) నుంచి కేజీ టమాటాను 40 రూపాయలకు విక్రయించాలని నేషనల్ కో-ఆపరేటివ్ కన్య్సూమర్స్ ఫెడరేషన్‌కు (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఆదివారం నుంచి కిలో టమాటా 40 రూపాయలకే వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.
దేశవ్యాప్తంగా ఆగస్ట్ 15 నుంచి కిలో టమోటా 50 రూపాయలకు, అంతకంటే తక్కువ ధరకే అందుబాటులో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇవ్వక ముందే టమోటా ధరలు దిగొచ్చాయి. ఏపీలోని మదనపల్లె, అనంతపురంతో పాటు కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పండుతున్న టమాటా అందుబాటులోకి రావడంతో ఒక్కసారిగా టమాటా ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. సుమారు రెండు నెలలుగా ఊహించని ధరతో ఠారెత్తించిన టమాటా ధరలు తగ్గుతుండటంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.