Governor RN Ravi: గవర్నర్ సంచలన వ్యాఖ్యలు.. అది ఎక్కడ కుదిరినా.. తమిళనాడులో కుదరదులే..
ABN , First Publish Date - 2023-04-14T07:58:34+05:30 IST
తమిళుల నాగరికత 3500 సంవత్సరాలనాటిదని, హిందీ భాషకంటే తమిళ భాషే అత్యంత ప్రాచీనమైనదని, సంస్కృతమే
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమిళుల నాగరికత 3500 సంవత్సరాలనాటిదని, హిందీ భాషకంటే తమిళ భాషే అత్యంత ప్రాచీనమైనదని, సంస్కృతమే తమిళభాషకు ధీటైన ప్రాచీన భాష అని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి కొనియాడారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi)లో ఉన్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమిళభాషను అభ్యసిస్తున్నారు. తమిళభాషను అధ్యయనం చేస్తున్న 20 మంది విద్యార్థులు ‘తమిళనాడు దర్శనం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. గత పదిరోజులు వీరంతా పలు నగరాలలో పర్యటించి గురువారం ఉదయం రాజ్‌భవన్ చేరుకుని గవర్నర్ ఆర్‌ఎన్ రవితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆ విద్యార్థులనుద్దేశించి గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రసంగిస్తూ రాష్ట్రంలో తమిళభాషకే అత్యంత ప్రాధాన్యతినిస్తుండటంతో హిందీ సహా ఇతర భాషలను నిర్బంధంగా అమలు చేయలేరని అన్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందినవారు, ఇతర భాషలకు చెందినవారంతా తమిళభాషను, తమిళ సాహిత్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తికనబరుస్తుండడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తమిళభాషను లోతుగా అధ్యయనం చేయాలని, తమిళ పండితులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(Banaras Hindu University)లో తమిళం అభ్యసించే విద్యార్థులకు ఇకపై ప్రతియేటా రాజభవన్ ఆధ్వర్యంలోనే తమిళ దర్శనం కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తామని గవర్నర్ ప్రకటించారు. తిరుక్కురళ్‌లో మానవజాతికి అత్యంత అవసరమైన సూక్తులు ఉన్నాయని, దానిని కూడా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుక్కురళ్‌లాగే తమిళంలో అత్యంత ప్రాచీన సాహిత్యాలు ఎన్నో ఉన్నాయని, వాటిపై కూడా విద్యార్థులు దృష్టిసారించాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సెమ్మొళి తమిళ పరిశోధనా సంస్థ హిందీ, నేపాలీ భాషలలో అనువదించిన కొన్ని గ్రంథాలను విద్యార్థులకు ఆయన అందజేశారు.