Governor RN Ravi: గవర్నర్‌ రవి సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-04-07T11:23:09+05:30 IST

ఇన్నాళ్లూ రాజ్‌భవన్‌కు, జార్జ్‌కోటకు మధ్య జరిగిన మౌనయుద్ధం మాటలరూపం దాల్చుతోంది. ఇన్నాళ్లూ తన చేతలతో డీఎంకే ప్ర

Governor RN Ravi:  గవర్నర్‌ రవి సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లూ రాజ్‌భవన్‌కు, జార్జ్‌కోటకు మధ్య జరిగిన మౌనయుద్ధం మాటలరూపం దాల్చుతోంది. ఇన్నాళ్లూ తన చేతలతో డీఎంకే ప్రభుత్వాన్ని పరోక్షంగా ఇరుకున బెట్టిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi).. ఇప్పుడు గొంతు సవరించుకున్నారు. అధికార పార్టీని ఇరుకునబెట్టేలా సంచలన ఆరోపణలు చేశారు. తిరునల్వేలి జిల్లా కూడన్‌కుళంలో ఏర్పాటైన అణువిద్యుత్‌ కేంద్రానికి, స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా రేగిన ఆందోళనల్ని ఆయన తాజాగా ప్రస్తావించారు. ఆ రెండు ఆందోళనలకు విదేశాల నుంచి నిధులు సమకూరాయని ఆరోపించారు. ఈ రెండు ఆందోళనలకు గతంలో డీఎంకే, దాని మిత్రపక్షాలు పరోక్ష మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో డీఎంకే(DMK) కూటమిని ఇరుకునబెట్టడమే గవర్నర్‌ ఉద్దేశమని తేలిపోయింది.

సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి గురువారం స్థానిక గిండిలోని రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ‘థింక్‌ టు డేర్‌’ పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో ఓ విద్యార్థి విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలకు వస్తున్న నిధులను అడ్డుకోవాల్సిన అవసరమేముందని అడిగిన ప్రశ్నకు గవర్నర్‌ బదులిస్తూ.. విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలకు పలు కోట్ల రూపాయలు వస్తున్నాయన్నారు. ఆ నిధులను సరైన పద్ధతిలో వినియోగించకుండా, దేశాభివృద్ధిని అడ్డుకొనేలా ఇతరాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. మన దేశాభివృద్ధిని నియంత్రించేలా పలుదేశాలు ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో మన దేశానికి వ్యతిరేకంగా సంవత్సరానికి రూ.250 కోట్ల వరకు విదేశీ నిధులు వినియోగించారు. అదే విధంగా కూడన్‌కుళం అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు విదేశీ నిధులు సమకూరాయన్నారు. కేరళ రాష్ట్రంలో విలిజ్ఞం పోర్ట్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా, తూత్తుకుడి స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు కూడా విదేశీ నిధులు అందాయన్నారు. తూత్తుకుడిలోని స్టెరిలైట్‌ కర్మాగారం దేశంలో కాపర్‌ అవసరాలను 40 శాతం పూర్తిచేస్తుందన్నారు. కానీ ప్రజలను రెచ్చగొట్టి ఆ కర్మాగారం మూతపడేలా చేశారన్నారు. ఆందోళన సమయంలో తుపాకీ కాల్పల ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఇఫ్‌ ఇండియా లాంటి సంస్థలకు విదేశాల నుంచే నిధులు అందుతున్నాయన్నారు. పర్యావరణం, మానవ హక్కులు, వాతావరణం వంటి అనేక అంశాలు పేర్కొంటూ దేశాభివృద్ధికి వ్యతిరేకంగా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. దేశాభివృద్ధిని నిరోధించేలా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా వస్తున్న నిధులను నియంత్రించేలా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.

బిల్లు పెండింగ్‌లో ఉందంటే ఆమోదం లేదని అర్థం

శాసనసభ నెరవేర్చిన బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టడంపై గవర్నర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర శాసనసభ నుంచి వచ్చిన బిల్లును పరిశీలించాల్సిన బాధ్యత గవర్నర్‌పై వుంటుందన్నారు. ప్రజాజాబితాలో లేని అంశాలపై కేంద్రప్రభుత్వం చట్టం చేయకుంటే రాష్ట్రప్రభుత్వం చట్టం చేయవచ్చని, అయితే కేంద్రప్రభుత్వ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టం ఉండాలన్నారు. శాసనసభ తీర్మానాలు-బిల్లులు గవర్నర్‌ పెండింగ్‌లో ఉంచారంటే, దానికి ఆమోదం లేదని అర్థమని పేర్కొన్నారు. ‘పెండింగ్‌’ అంటే పౌర ఆమోదం పొందలేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెబుతోందని వ్యాఖ్యానించారు. శాసనసభలో ఆమోదించిన బిల్లు రాజ్యాంగానికి లోబడి ఉందో, లేదో గవర్నర్‌ పరిశీలించాల్సి ఉందన్నారు. శాసనసభలో నెరవేర్చినంత మాత్రాన అది చట్టం కాబోదని, శాసనసభ వ్యవస్థలో ఒక భాగం మాత్రమేనన్నారు. అందువల్లనే శాసనసభలో నెరవేర్చిన బిల్లులు, తీర్మానాలు గవర్నర్‌కు పంపుతారని గవర్నర్‌ గుర్తు చేశారు.

Updated Date - 2023-04-07T11:23:09+05:30 IST