Governor ‘నీట్’కు సన్నద్ధం కావాల్సిందే..
ABN , First Publish Date - 2023-05-11T10:24:11+05:30 IST
వైద్యకోర్సులపై ఆసక్తి ఉంటే ‘నీట్’కు సన్నద్ధం కావాల్సిందేనని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi)
పెరంబూర్(చెన్నై): వైద్యకోర్సులపై ఆసక్తి ఉంటే ‘నీట్’కు సన్నద్ధం కావాల్సిందేనని గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) విద్యార్థులకు సూచించారు. ప్లస్ టూలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులతో బుధవారం స్ధానిక గిండిలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల వెలువడిన ప్లస్ టూ ఫలితాల్లో 600లకు 600 మార్కులు సాధించిన విద్యార్థిని నందిని కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్ధేశించి గవర్నర్ మాట్లాడుతూ.. వైద్యకోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు నీట్‌కు సన్నద్ధం కావాలన్నారు. లక్ష్యసాధనపై విద్యార్థులు స్పష్టత కలిగి ఉండాలని, సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చదువు సంబంధిత విషయాలపై మాత్రమే విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కామర్స్‌లో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు సీఏ కోర్సు, న్యాయవాదులు కావాలనే విద్యార్థులు లా కోర్సు ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ప్లస్ టూ విద్యార్థినికి లక్కీ ఛాన్స్...
చెన్నైలో పర్యటించే రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వీవీఐపీలు బస చేసే రాజ్‌భవన్‌లోని ప్రత్యేక బంగ్లాలో ఆతిథ్యం పొందే అరుదైన అవకాశం గవర్నర్ రవి చొరవతో తెన్‌కాశి జిల్లా కడయనల్లూరుకు చెందిన ఓ ముస్లిం విద్యార్థినికి దక్కింది. అధికారులు నిబంధనలు గుర్తు చేసినా, గవర్నర్ వాటిని తోసిరాజని ఆ బాలికను, ఆమె కుటుంబానికి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..!
ప్లస్ టూ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో రాజ్‌భవన్‌లో బుధవారం గవర్నర్ ఆర్‌ఎన్ రవి భేటీ అయ్యారు. గవర్నర్ వద్దకు వచ్చిన వారికి రాజ్‌భవన్(Raj Bhavan)లోని గదుల్లో బస కల్పించారు. ఈ కార్యక్రమం కోసం తెన్‌కాశి జిల్లా కడయనల్లూర్‌కు చెందిన షఫ్రీన్ అనే బాలిక తన కుటుంబం సహా రాజ్‌భవన్‌కు వచ్చింది. అయితే వరుస క్రమంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వీవీఐపీలు అతిథ్యం పొందే బంగ్లా ఆమె కుటుంబానికి కేటాయించారు. అయితే ఆ బంగ్లాలో సాధారణ కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వడం కుదరదని అధికారులు చివరి నిమిషంలో గవర్నర్‌కు నిబంధనలు గుర్తు చేశారు. అధికారుల మాటల్ని ఆలకించిన గవర్నర్.. ‘‘రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించిన బాలిక కూడా వీవీఐపీనే. కూలి కార్మికుడి బిడ్డ ఇన్ని మార్కులు సాధించిందంటే ఆమె ఎంత కష్టపడి ఉంటుంది? ఆమె కోసం ఎలాంటి నిబంధనలు సడలించినా తప్పు లేదు. ఆమె కుటుంబానికి ఆ బంగ్లానే ఇవ్వండి’’ అని ఆదేశించారు. దాంతో అధికారులు షఫ్రీన్ కుటుంబం కోసం వీవీఐపీల బంగ్లా తలుపులు తెరిచారు.