Manipur Violence: పార్లమెంటులో చర్చకు మేము రెడీ : అమిత్‌షా

ABN , First Publish Date - 2023-07-24T16:30:29+05:30 IST

మణిపూర్ అంశంపై పార్లమెంటు సభాకార్యక్రమాలు మూడవ పనిదినమైన సోమవారంనాడు కూడా ఎలాంటి సభాకార్యక్రమాలు లేకుండా వాయిదా పడింది. ఇటు అధికార పక్షం, అటు విపక్షం పట్టువిడుపులు లేని ధోరణి ప్రదర్శిస్తుండటంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. మణిపూర్‌లో అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

Manipur Violence: పార్లమెంటులో చర్చకు మేము రెడీ : అమిత్‌షా

న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై (Manipur Issue) పార్లమెంటు సభాకార్యక్రమాలు మూడవ పనిదినమైన సోమవారంనాడు కూడా ఎలాంటి సభాకార్యక్రమాలు లేకుండా వాయిదా పడింది. ఇటు అధికార పక్షం, అటు విపక్షం పట్టువిడుపులు లేని ధోరణి ప్రదర్శిస్తుండటంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Sha) లోక్‌సభలో (Loksabha) కీలక ప్రకటన చేశారు. మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. చర్చ సజావుగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.


''మణిపూర్‌ అంశంపై చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. విపక్షాలు చర్చకు ఎందుకు సుముఖంగా లేరో అర్ధం కావడం లేదు. ముందు సభలో చర్చను జరగనీయండి. అత్యంత సున్నితమైన ఈ అంశంలో వాస్తవం ఏమిటనేది దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది'' అని అమిత్‌షా అన్నారు. మణిపూర్‌లో హింసాకాండపై పార్లమెంటులో ప్రతిష్ఠంభనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలుసుకున్న అనంతరం అమిత్‌షా ఈ ప్రకటన చేయడం విశేషం.


దీనికి ముందు, మణిపూర్‌ ఉదంతంపై ఉభయ సభలు అట్టుడికాయి. పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని, సభలో మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్‌ఎస్‌ తదితర ప్రతిపక్షాలు గళమెత్తాయి. ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని డిమాండ్‌ చేశాయి. మణిపూర్‌పై చర్చించాలని వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. సభ్యులు ఇచ్చిన నోటీసులపై స్వల్పకాలిక చర్చకు అటు లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ అంగీకరించారు. అయితే రాజ్యసభ రూల్‌ 267 కింద సభా కార్యకలాపాలన్నీ నిలిపివేసి మణిపూర్‌పై చర్చ జరపాలని ఖర్గే పట్టుబట్టారు. దీనికి అనుమతించకపోవడంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం పార్లమెంట్ ఆవరణలో కూడా అధికార, విపక్ష పార్టీల ప్లకార్డులతో పోటాపోటీగా ఆందోళనలకు దిగాయి. పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ ఎంపీలు ఆందోళన చేశారు. బెంగాల్ హింస, రాజస్థాన్‌లో మహిళలపై నేరాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రధాని సభకు వచ్చి మణిపూర్ అంశంపై మాట్లాడితే ఇబ్బంది ఏమిటని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆయన సభకు వస్తే ఆకాశం విరిగి మీదపడిపోదంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు, మణిపూర్ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ అనుచితంగా వ్యవహరించారంటూ 'ఆప్' ఎంపీ సంజయ్ శర్మపై సోమవారంసస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకూ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌కఢ్ ప్రకటించారు.

Updated Date - 2023-07-24T17:17:30+05:30 IST