Robo serves Tea: ప్రధాని మోదీకి టీ అందించిన రోబో
ABN , First Publish Date - 2023-09-27T18:44:56+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అహ్మదాబాద్ సైన్స్ సిటీలో రోబో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఆ సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ రోబో నేరుగా ప్రధానమంత్రికి టీ అందించింది.
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారంనాడు గుజరాత్‌లోని అహ్మదాబాద్ (Ahmedabad) సైన్స్ సిటీలో రోబో ఎగ్జిబిషన్ (Robo exhibition)ను తిలకించారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి వివిధ రోబో స్టాల్స్‌ను, రోబోలు చేస్తున్న విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఆ సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ రోబో నేరుగా ప్రధానమంత్రికి, సీఎంకు టీ అందించింది.
ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మానవులకు రోబో ఏ విధంగా సహాయం చేస్తుందో మోదీ ఆసక్తిగా చూస్తున్నట్టు కూడా ఆ వీడియోలో ఉంది. రోబోలు వివిధ రంగాల్లో సేవలందించే విషయంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ప్రధానికి అక్కడి రోబోటిక్ ఇంజనీర్లు వివరించారు. ''రోబోటిక్స్‌తో భవిష్యత్తులో అంతులేని అవకాశాలను అన్వేషించండి..''అంటూ మోదీ ట్విట్టర్ పోస్టులో రాశారు. దీనికి ముందు, వైబ్రంట్ గ్లోబల్ సమ్మిట్-2023ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ కూడా మోదీ వెంట ఉన్నారు.