Gyanavapi Mosque case: జ్ఞానవాపి మసీదు కార్బన్ డేటింగ్‌కు వారణాసి కోర్టు అనుమతి
ABN , First Publish Date - 2023-07-21T17:10:42+05:30 IST
కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకున్న ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ సైంటిఫిక్ సర్వే కు వారణాసి కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. వివాదాస్పద "శివలింగం'' జోలికి వెళ్లకుండా కాంప్లెక్‌లో భారత పురావస్తు శాఖ సైంటిఫిక్ సర్వే జరపవచ్చని తెలిపింది.
వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకున్న ఉన్న జ్ఞానవాపి మసీదు కేసు (Gyanavapi Mosque case) వ్యవహారం మరో మలుపు తిరిగింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ సైంటిఫిక్ సర్వే (Scientific Survey)కు వారణాసి కోర్టు (Varanasi court) శుక్రవారంనాడు అనుమతి ఇచ్చింది. వివాదాస్పద "శివలింగం'' జోలికి వెళ్లకుండా కాంప్లెక్‌లో భారత పురావస్తు శాఖ (ASI) సైంటిఫిక్ సర్వే జరపవచ్చని తెలిపింది.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ మొత్తాన్ని సర్వే చేయాల్సిందిగా ఏఎస్ఐను ఆదేశించాలని హిందువుల తరఫున ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తన పిటిషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు. గత మేలో ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టిన కోర్టు తమ వాదనను కోర్టుకు సమర్పించాలని జ్ఞానవాపి మసీదు కమిటీని ఆదేశించింది. శుక్రవారం ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తాజా ఆదేశాలిచ్చింది.
మసీదు కాంప్లెక్స్ మొత్తాన్ని పురావస్తు పరిశోధనా శాఖ విచారణ జరిపినప్పుడు మాత్రమే ఆలయం-జ్ఞానవాపి మసీదు వివాదం పరిష్కారమవుతుందని వాదనల సందర్భంగా జైన్ కోర్టుకు విన్నవించారు. కాగా, గత మేలో సుప్రీంకోర్టు సైతం జ్ఞానవాపి మసీదు-కాశీ విశ్వనాథ్ కారిడార్ లోపలి వివాదాస్పద శివలింగానికి కార్బన్ డేటింగ్ జరపవద్దని ఏఎస్ఐకి స్పష్టం చేసింది. అక్కడ ఉన్నది శివలింగమా, ఫౌంటైనా అనేది నిర్దారించేందుకు సైంటిఫిక్స్ ఇన్వెస్టిగేషన్‌కు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. కాగా, వారణాసి కోర్టు తాజా అదేశాలపై జైన్ మీడియాతో మాట్లాడుతూ, కోర్టు ఆదేశించిన ప్రకారం ఏఎస్ఐ సర్వే పూర్తికావడానికి 3 నుంచి 6 నెలలు పడుతుందని చెప్పారు.