Gyanvapi Mosque: సీల్డ్ కవర్‌లో వారణాసి కోర్టుకు ఆర్కియాలజీ సర్వే నివేదిక
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:49 PM
జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయ సర్వే నివేదికను భారత పురావస్తు శాఖ సోమవారంనాడు వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించింది. సీల్డ్ కవర్‌లో ఈ నివేదికను అర్కియాలజికల్ సర్వే స్టాండింగ్ కౌన్సిల్ అమిత్ శ్రీవాత్సవ అందజేశారు.
వారణాసి: జ్ఞానవాపి మసీదు (Gyanvapi Mosque)పై శాస్త్రీయ సర్వే (Scientific survey) నివేదికను భారత పురావస్తు శాఖ (Archaeological Survey of India-ASI) సోమవారంనాడు వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించింది. సీల్డ్ కవర్‌లో ఈ నివేదికను అర్కియాలజికల్ సర్వే స్టాండింగ్ కౌన్సిల్ అమిత్ శ్రీవాత్సవ అందజేశారు. వారణాసి జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ సర్వే నివేదికను సమర్పించేందుకు కోర్టు గత వారంలో ఏఎస్ఐకి వారం రోజుల పాటు గడువు పొడిగించింది.
కోర్టుకు సోమవారంనాడు సర్వే నివేదికను అందజేసినట్టు హిందూ వర్గం తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సుప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదును 17వ శతాబ్దంలో నిర్మించడానికి ముందు అక్కడ హిందూ ఆలయం ఉండేదా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఏఎస్ఐ ఈ శాస్త్రీయ సర్వేను నిర్వహించింది. శాస్త్రీయ సర్వేకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించడం, జిల్లా కోర్టు తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్ధించడంతో, హైకోర్టు తీర్పును జ్ఞానవాపి కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో శాస్త్రీయ సర్వే ప్రారంభానికి ఆటంకాలు తొలగిపోయాయి.