Share News

Dera Baba: డేరా బాబాకు 21 రోజుల పెరోల్..21 నెలల్లో ఇది ఆరోసారి

ABN , First Publish Date - 2023-11-20T19:13:57+05:30 IST

వివాదాస్పద గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానా ప్రభుత్వం 21 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన రెండు హత్యాకేసుల్లో యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత 21 నెలల్లో ఆయన జైలు నుంచి పెరోల్‌పై విడుదల కావడం ఇది ఆరవసారి.

 Dera Baba: డేరా బాబాకు 21 రోజుల పెరోల్..21 నెలల్లో ఇది ఆరోసారి

ఛండీగఢ్: వివాదాస్పద గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ (Gurmeet Ram Rahim)కు హర్యానా (Haryana) ప్రభుత్వం 21 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన రెండు హత్యాకేసుల్లో యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత 21 నెలల్లో ఆయన జైలు నుంచి పెరోల్‌పై విడుదల కావడం ఇది ఆరవసారి.


కాగా, హత్యాభియోగాలతో యవజ్జీవ శిక్ష పడిన ఖైదీగా డేరా బాబాకు తరచు పెరోల్ దొరుకుతుండటం వివాదాస్పదమవుతోంది. ఏ ప్రాతికదికన ఆయనకు పెరోల్ ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డేరాబాబాకు ప్రముఖ వ్యక్తుల్లో మంచి పలుకుబడి ఉండటం, ఆయన భక్తుల్లో పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉండటం కారణంగా కనిపిస్తోందని విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అయితే, ఇందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని, జైలు నిబంధనలకు అనుగుణంగా అధికారులే తగిన నిర్ణయం తీసుకుంటారని హర్యానా సర్కార్ చెబుతోంది. గతంలో హర్యానా పంచాయితీ ఎన్నికలు, అడంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు 45 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. తల్లికి అనారోగ్యం కారణంగా రెండుసార్లు పెరోల్ వచ్చింది. ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసిన కేసులోనూ, తన మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులోనూ డేరా బాబాను కోర్టు దోషిగా నిర్ధారించింది. 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Updated Date - 2023-11-20T19:13:59+05:30 IST