Heavy rain: ఊటీలో భారీ వర్షం.. ఇళ్లలోకి ప్రవేశించిన నీరు..
ABN , First Publish Date - 2023-05-26T08:22:22+05:30 IST
నీలగిరి జిల్లా ఊటీ(Ooty), పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీవర్షానికి ఇళ్లలో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొద్దిరోజులుగా ఊటీలో ఎండ
- చెన్నై శివారు ప్రాంతాల్లో కుండపోత
పెరంబూర్(చెన్నై): నీలగిరి జిల్లా ఊటీ(Ooty), పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీవర్షానికి ఇళ్లలో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొద్దిరోజులుగా ఊటీలో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో భారీవర్షం(Heavy rain) కురిసింది. ఊటీ, చారింగ్ క్రాస్, మార్కెట్, కమర్షియల్ రోడ్డు, బస్టాండ్ తదితర ప్రాంతాల సమీపంలోని ఇళ్లలో వరద నీరు ప్రవహించింది. సుమారు గంటన్నర సేపు కురిసిన వర్షంతో పర్యాటకులు హోటళ్లు, లాడ్జీలకే పరిమితమయ్యారు. వాహనచోదకులు వాహనాలను రోడ్డు పక్కన నిలిపి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు.
చెన్నై నగర శివారు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి రోడ్లపై నీరు ప్రవహించింది. నగరంలో రెండ్రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోత అధికంగా ఉంటోంది. ఉదయం 8 గంటల నుంచే భానుడి ప్రతాపం కనిపిస్తోంది. స్థానిక మీనంబాక్కంలో గురువారం అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండ్రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో, శివారు ప్రాంతాలైన పల్లావరం, తాంబరం(Tambaram), మేడవాక్కం, పెరుంగళత్తూర్, పల్లికరనై, గుడువాంజేరి, ఊరపాక్కం తదితర ప్రాంతాల్లో సాయంత్రం 5 నుంచి భారీవర్షం కురిసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కాల్వల నిర్మాణం జరుగుతుండడంతో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, సేలం జిల్లా ఎడప్పాడి పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములతో కూడిన భారీవర్షం కురిసింది.