Himant Biswa Sharma: మీ అసెంబ్లీలో కాదు, ఇక్కడ ఆ మాట అనండి.. ఢిల్లీ సీఎంకు అసోం సీఎం సవాల్..!

ABN , First Publish Date - 2023-03-31T18:18:44+05:30 IST

అసోంలోని గౌహతిలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ సదస్సు జరుగనున్న నేపథ్యంలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌..

Himant Biswa Sharma: మీ అసెంబ్లీలో కాదు, ఇక్కడ ఆ మాట అనండి.. ఢిల్లీ సీఎంకు అసోం సీఎం సవాల్..!

గౌహతి: అసోంలోని గౌహతిలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజకీయ సదస్సు జరుగనున్న నేపథ్యంలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) నిప్పులు చెరిగారు. ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడిన మాటలే అసోంలో మాట్లాడితే ఆ మరుసటి రోజే పరువునష్టం కేసు (Defamation Case) వేస్తానని కేజ్రీవాల్‌ను హెచ్చరించారు. హిమంత బిశ్వ శర్మపై కేసులున్నాయని ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించినట్టు సమాచారం. దీనిపై శర్మ ఘాటుగా స్పందించారు.

''నామీద ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందా? అరవింద్ కేజ్రీవాల్‌పై పరువునష్టం కేసు వేయాలని అనుకున్నాను. కానీ ఆయన 'పిరికివాడు'లా అసెంబ్లీ లోపల ఆ మాటలు అన్నారు. నామీద ఒక్క కేసు ఉన్నా చూపించమని వాళ్లను సవాల్ చేస్తున్నాను. ఏప్రిల్ 2న కేజ్రీవాల్ ఇక్కడకు వచ్చి నాకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా, ఆ మరుసటి రోజే ఆయనపై పరువునష్టం కేసు వేస్తాను. మనీష్ సిసోడియా విషయంలోనూ ఇదే చేశాను. అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి ఢిల్లీ అసెంబ్లీలో కూర్చుని ఏవేవో మాట్లాడటం సరికాదు" అని శర్మ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు.

అసోంలో తొలి రాజకీయ ర్యాలీలో పాల్గొనేందుకు అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 2న అసోం రానున్నారు. ఆసక్తికరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిగ్రీ వివరాలు వెల్లడించాలని గుజరాత్ యూనివర్శిటీని కోరినందుకు కేజ్రీవాల్‌పై గుజరాత్ హైకోర్టు రూ.25,000 జరిమానా విధించిన రోజే కేజ్రీవాల్‌ను అసోం సీఎం సవాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2023-03-31T18:18:44+05:30 IST