Himanta Biswa Sarma: నేనే రాహుల్‌నైతే....? సీఎం సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-03-29T19:48:25+05:30 IST
రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై వేటు పడటం, దీనిపై పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు నల్లజెండాలతో నిరసనలు..
న్యూఢిల్లీ: రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పార్లమెంటు సభ్యత్వంపై వేటు పడటం, దీనిపై పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు నల్లజెండాలతో నిరసనలు చేపట్టడంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ (Himanta Biswa Sarma) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తరహాలో తనను కోర్టు దోషిగా ప్రకటిస్తే ఆయనలా చేయనని అన్నారు. అసోం అసెంబ్లీ సమావేశాల్లో బుధవారంనాడు సీఎం మాట్లాడుతూ, తనకై గనుక ఏదైనా కేసులో జైలు శిక్ష విధిస్తే న్యాయపరంగా దానిని ఎదుర్కొంటానే కానీ కోర్టులను అవమానించనని అన్నారు.
''నన్ను ఏదైనా కేసులో కోర్టు దోషిగా నిర్దారించి జైలు శిక్ష వేస్తే మా ఎమ్మెల్యేలు (బీజేపీ) ఎవరూ నల్లజెండాల నిరసనలు చేపట్టరు. నేను కూడా వాళ్లకు అలా చేయమని చెప్పను. పైకోర్టులకు వెళ్తాను. అంతేకానీ న్యాయవ్యవస్థపై ఎలాంట వ్యాఖ్యలు చేయను. భారత ప్రజాస్వామినికి కాంగ్రెస్ తీరు మంచి సంకేతాలను ఇవ్వడం లేదు'' అని సీఎం వ్యాఖ్యానించారు. మోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా ప్రకటిస్తూ, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. పైకోర్టుకు వెళ్లేందుకు 30 రోజుల గడువుతో పాటు, బెయిల్ కూడా మంజూరు చేసింది. అనంతరం కొద్ది గంటలకే ఆయన లోకసభ సభ్యత్వంపై లోక్‌సభ సెక్రటేరియట్ వేటు వేసింది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. కాగా, నిబంధనల ప్రకారమే రాహుల్‌పై వేటు పడిందని, కోర్టు గడువు ఇచ్చినందున ఎందుకు ఆయన దిగువ కోర్టు తీర్పును పైకోర్టులో సవాలు చేయడం లేదని బీజేపీ నిలదీస్తోంది.