Bihar : బిహార్‌లో ప్రముఖ పాత్రికేయునిపై కాల్పులు, హత్య

ABN , First Publish Date - 2023-08-18T13:10:18+05:30 IST

ప్రముఖ హిందీ దినపత్రికలో పని చేస్తున్న పాత్రికేయుడు విమల్ కుమార్‌ శుక్రవారం ఉదయం దారుణంగా హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, పారిపోయారు.

Bihar : బిహార్‌లో ప్రముఖ పాత్రికేయునిపై కాల్పులు, హత్య

పాట్నా : ప్రముఖ హిందీ దినపత్రికలో పని చేస్తున్న పాత్రికేయుడు విమల్ కుమార్‌ శుక్రవారం ఉదయం దారుణంగా హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, పారిపోయారు. ఆరారియా జిల్లాలో జరిగిన ఈ హత్యను పాత్రికేయులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు కరువయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆరారియా జిల్లా, రాణీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్‌లో విమల్ కుమార్ (40) నివసిస్తున్నారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఆయనపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఆయన ఛాతీ కుడివైపున తూటాలు దూసుకెళ్లడంతో, ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దుండగులు తమ మోటార్ బైక్‌పై పారిపోయారు.

ఆరారియా పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, విమల్ కుమార్ మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించినట్లు తెలిపారు. సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను, జాగిలాలను పంపించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితులను పట్టుకోవడం కోసం గాలింపు జరుగుతోందన్నారు.


విమల్ సోదరుడు శశిభూషణ్ 2019లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన సాక్షి విమల్. ఈ కారణంతోనే విమల్‌ను హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

విమల్ హత్యతో బిహార్‌లో పాత్రికేయులు ఆందోళనకు గురయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురువారం న్యూఢిల్లీ నుంచి తిరిగి స్వరాష్ట్రానికి వచ్చారు. ఆయనతో మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో గత కొన్ని నెలల్లో నేరాలు పెరిగినట్లు వస్తున్న ఆరోపణలను ప్రస్తావించారు. నితీశ్ స్పందిస్తూ, కేవలం కొన్ని సంఘటనలు మాత్రమే జరిగాయని, వీటి ఆధారంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని చెప్పలేమని అన్నారు.


ఇవి కూడా చదవండి :

Plane Crash : మలేసియాలో విమాన ప్రమాదం.. 10 మంది మృతి..

Indian Muslims : భారతీయ ముస్లింలపై గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు.. బజరంగ్ దళ్, వీహెచ్‌పీ స్పందన..

Updated Date - 2023-08-18T13:22:49+05:30 IST