Hyper loop: చెన్నై-బెంగళూరు మధ్య హైపర్ లూప్?

ABN , First Publish Date - 2023-03-26T12:51:54+05:30 IST

ప్రయాణీకుల్ని 25 నిమిషాల్లోనే చెన్నై నుంచి బెంగుళూరుకు చేర్చేందుకు భారత రైల్వే కసరత్తు చేస్తోంది. వినడానికి నమ్మశక్యంగా

Hyper loop: చెన్నై-బెంగళూరు మధ్య హైపర్ లూప్?

- ప్రాజెక్టు అమలైతే 25 నిమిషాల్లోనే గమ్యస్థానం!

- సాధ్యసాధ్యాలపై అధ్యయనం

(చెన్నై, ఆంధ్రజ్యోతి)

ప్రయాణీకుల్ని 25 నిమిషాల్లోనే చెన్నై నుంచి బెంగుళూరుకు చేర్చేందుకు భారత రైల్వే కసరత్తు చేస్తోంది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజంగా నిజం. చెన్నై నుంచి రోడ్డు, లేదా రైలు మార్గంలో బెంగుళూరు(Bangalore) వెళ్లాలంటే కనీసం 6గంటలు ప్రయాణించాల్సిందే. నగర శివారు ప్రాంతం దాటేందుకే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. ఇక విమానంలో గంట ప్రయాణం తప్పదు. దానికంటే ముందు విమానాశ్రయంలో రెండుగంటల ‘ప్రహసనం’. దీంతో ఈ ప్రయాణాలంటే ఎవరికైనా బోర్‌ కొట్టడం ఖాయం. అయితే చెన్నైలో బయలుదేరిన అరగంటలోనే బెంగుళూరు చేర్చేందుకు రైల్వేశాఖ నడుం బిగించింది. మద్రాస్‌ ఐఐటీ(Madras IIT)తో కలిసి అసాధ్యంగా భావించే ఈ స్వప్నాన్ని సుసాధ్యం చేసేందుకు కృషి చేస్తోంది. భారత రైల్వే - మద్రాస్‌ ఐఐటీ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే పదేళ్లలో ‘హైపర్‌ లూప్‌’ రైళ్లు గాలితో పోటీ పడేందుకు సిద్ధం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

దేశంలో ‘హైపర్‌ లూప్‌’ రైలు పథకం సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అధ్యయన సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తోంది. ప్రపంచంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేలా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కొత్త మార్గాలపై అధ్యయనం చేస్తోంది. దేశంలో ‘వందే భారత్‌’, ‘బుల్లెట్‌ రైళ్ల’ పేరుతో వేగవంతమైన రవాణా కోసం త్వరితగతమైన అడుగులే పడుతున్నాయి. అందులో తదుపరి ఘట్టంగా హైపర్‌ లూప్‌ రవాణా వ్యవస్థ పరిచయం కానుంది.

హైపర్‌ ల్యూప్‌ సాంకేతికత

వాక్యూమ్‌ ట్యూబ్‌ లోపల క్యాప్సూల్‌ ద్వారా ప్రయాణం. హైపర్‌లూప్‌ అనేది అయస్కాంత తరంగాలను ఉపయోగించి ఈ క్యాప్సూల్‌ను కదిలించే సాంకేతికత. రైల్వే బ్రిడ్జీల్లానే ఈ హైపర్‌ లూప్‌ వ్యవస్థ కోసం ప్రత్యేక స్తంభాలు, వాటిపై పైపులు ఏర్పాటు చేస్తారు. ఆ ట్యూబ్‌ లోపల ప్రయాణానికి క్యాప్సూల్స్‌ ఉంటాయి. ఈ క్యాప్సూల్‌ లోపల ప్రయాణికులు కూర్చుంటారు. క్యాప్సూల్స్‌ను అయస్కాంత తరంగాల ద్వారా కదిలించినప్పుడు, క్యాప్సూల్‌ ట్రాక్‌పై రైలులాగా ట్యూబ్‌ లోపల ప్రయాణిస్తుంది. 2012లో కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో టెస్లా సంస్థ అధ్యక్షుడు ఎలాన్‌ మస్క్‌ మాట్లాడుతూ... గంటకు 1,200 కి.మీ వేగంతో వెళ్లే సరికొత్త రవాణా వ్యవస్థ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు సంయుక్తంగా హైపర్‌ లూప్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించాయి. 2020లో వర్జిన్‌ హైపర్‌ లూప్‌ సంస్థ గంటకు 170 కి.మీ వేగంతో హైపర్‌ లూప్‌ పాడ్స్‌తో ట్రయల్‌ రన్‌ నిర్వహించింది.

తొలిగా ముంబై - పుణె మధ్య...

ముంబై-పుణె మధ్య హైపర్‌ లూప్‌ రవాణా మార్గం ఏర్పాటుకు ట్రాన్స్‌పోర్టేషన్‌ టెక్నాలజీ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రవాణా అందుబాటులోకి వస్తే ముంబై నుంచి పుణెకు 35 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

మద్రాస్‌ ఐఐటీతో ఒప్పందం...

మద్రాస్‌ ఐఐటీలోని ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం విద్యార్థులు హైపర్‌ లూప్‌ రవాణా వ్యవస్థపై అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకున్న రైల్వేశాఖ.. రూ.8.50 కోట్ల నిధులు అందజేసింది. హైపర్‌ లూప్‌ ద్వారా 2025లో సరుకుల రవాణా, 2030లో ప్రయాణికుల రైళ్లు నడిపేలా మద్రాస్‌ ఐఐటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ మేరకు చెన్నై - బెంగుళూరు మధ్య హైపర్‌లూప్‌ పథకం అమలు సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ వ్యవస్థ వల్ల 25 నిమిషాల్లోనే చెన్నై నుంచి బెంగుళూరు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తీవ్రమైన కసరత్తు...

దేశంలో హైపర్‌ లూప్‌ రవాణా వ్యవస్థకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై రైల్వేశాఖ అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం అధ్యయనం చేసే సంస్థ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఇందులో సాధ్యాసాధ్యాల అధ్యయనం, ప్రయోగాత్మకంగా అమలుచేయడం, ఆర్థిక వనరులు తదితర అంశాలు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల మాట్లాడుతూ... 2026వ సంవత్సరం నాటికి దేశంలో బుల్లెట్‌ రైళ్లు పట్టాలెక్కుతాయని, వచ్చే ఏడెనిమిదేళ్లలో హైపర్‌ లూప్‌ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్న విషయం విదితమే. ఆ ప్రకారం, చెన్నై నుంచి బెంగుళూరు(Chennai to Bangalore) వరకు హైపర్‌ లూప్‌లో వెళ్లే రోజులు సమీపంలోనే వుందని రైల్వే వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Updated Date - 2023-03-26T12:51:54+05:30 IST