DK Shivakumar: గాంధీల మాటను శిరసావహించా: డీకే
ABN , First Publish Date - 2023-06-03T19:13:29+05:30 IST
ముఖ్యమంత్రి రేసు నుంచి ఎందుకు తప్పుకోవలసి వచ్చిందో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తొలిసారి వెల్లడించారు. గాంధీలు, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇచ్చిన సూచనకు అనుగుణంగానే తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు చెప్పారు. ఓర్పుతో ఉండాలనే మాటకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు.
కర్ణాటక: ముఖ్యమంత్రి రేసు (CM race) నుంచి ఎందుకు తప్పుకోవలసి వచ్చిందో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తొలిసారి వెల్లడించారు. గాంధీలు (Gandhis), పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సహా కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన సూచనకు అనుగుణంగానే తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు చెప్పారు. ఓర్పుతో ఉండాలనే మాటకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరూ సహనంతో ఉండాలని, వారి కోరిక (శివకుమార్‌ను సీఎంగా చూడాలనే కోరిక) ఎప్పటికీ వమ్ముకాదని డీకే చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి డీకే తన సొంత నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
''మీరు నన్ను సీఎం చేసేందుకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. కానీ మరోలా జరిగింది. అధిష్ఠానం పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాకు ఒక సూచన చేశారు. వారి మాటలను శిరసావహించాను. సహనంతో ఉందాం. మీ కోరిక వమ్ముకాదు'' అని డీకే తన మద్దతుదారులను అనునయించారు.. ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకునేందుకు, వారి ఆశీస్సులు అందుకునేందుకు సొంత నియోజకవర్గానికి వచ్చానని, తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. రానుున్న జిల్లా, పంచాయతీ ఎన్నికలకు తన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. సీఎం విషయంలో న్యూఢిల్లీలో తీవ్ర చర్చల అనంతరం సిద్ధరామయ్యను సీఎంగా అధిష్ఠానం ప్రకటించింది. డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 135 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొంది, మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలనే బీజేపీ ఆశలకు గండికొట్టింది.