Danish Ali: నేను ఏ నేరం చేయలేదు.. పార్టీ సస్పెన్షన్‌పై డేనిష్ అలీ కౌంటర్..
ABN , First Publish Date - 2023-12-09T20:44:29+05:30 IST
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆ పార్టీ ఎంపీ డేనిష్ అలీ అన్నారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తు్న్నట్టు బీఎస్‌పీ ప్రకటించడంపై తొలిసారి ఆయన స్పందించారు.
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షురాలు మాయావతి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఆ పార్టీ ఎంపీ డేనిష్ అలీ అన్నారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తు్న్నట్టు బీఎస్‌పీ ప్రకటించడంపై తొలిసారి ఆయన స్పందించారు.
''ఆమె (మాయావతి) తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం. నేను ఎన్నడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ఇందుకు నా నియోజకవర్గం అమ్రోహా ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నేను వ్యతిరేకిస్తున్నాను. ఇకముందు కూడా వ్యతిరేకిస్తూనే ఉంటాను. అదే నేరమైతే, నేను నేరం చేసినట్టు ఒప్పుకుంటాను. అందుకు శిక్ష అనుభవించేందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను'' అని డేనిష్ అలీ వివరణ ఇచ్చారు.
దీనికిముందు, డేనిష్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు శనివారంనాడు ఒక ప్రకటనలో బీఎస్‌పీ తెలిపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని గతంలో చాలా స్పష్టంగా చెప్పిన తర్వాతే పార్టీ టిక్కెట్ ఇచ్చామని, అయితే, పార్టీలో చేరినప్పుడు మీరు చేసిన వాగ్దానాన్ని మరిచిపోయినట్టు కనిపిస్తోందని బీఎస్‌పీ ఆరోపించింది. ఆ కారణంగానే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని పేర్కొంది. అయితే ఆయన చేసిన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాపాలు ఏమిటనేవి మాత్రం ఇతమిత్థంగా చెప్పలేదు.