ఉదయం ఇడ్లీతో పాటు చట్నీ, వడ, మధ్యాహ్నం తెల్లన్నం, రసం..
ABN , First Publish Date - 2023-05-14T11:23:15+05:30 IST
క్యాంటీన్ల నిర్వహణపై ఇటీవల ప్రజాభిప్రాయం సేకరించగా, 2.13 లక్షల మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు.
వేళచ్చేరి(చెన్నై): గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (Greater Chennai Corporation) పరిధిలోని అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై ఇటీవల ప్రజాభిప్రాయం సేకరించగా, 2.13 లక్షల మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. నగరంలోని 402 అమ్మా క్యాంటీన్‌లలో ఉదయం ఇడ్లీ, పొంగల్, మధ్యాహ్నం పెరుగన్నం, పులుసన్నం, సాంబారు అన్నం, కరివేపాకు అన్నం, సాయంత్రం చపాతీలు అతి తక్కువ ధరకు అందజేస్తున్నారు. ఈ క్యాంటీన్‌లకు ఏడాదికి రూ.140 కోట్లు ఖర్చు చేస్తుండగా, రూ.20 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుండగా, రూ.120 కోట్ల నష్టం కలుగుతోంది. క్యాంటీన్‌ల నిర్వహణ, ఆధార పదార్ధాల నాణ్యత, చేపట్టాల్సిన చర్యలు తదితరాలపై 21 ప్రశ్నలతో ప్రజాభిప్రాయ సేకరణ ఇటీవల చేపట్టగా, 2.13 లక్షల మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. ప్రధానంగా క్యాంటీన్‌లలో ఆహార పదార్ధాలు నాణ్యతగా ఉండాలని, ఉదయం వేళల్లో ఇడ్లీతో పాటు చట్నీ, వడ, మధ్యాహ్నం అన్నం, రసం, అప్పలం, వడ, ఊరగాయ, రాత్రి వేళల్లో ఇడ్లీ సహా ఇతర పదార్ధాలు అందించాలని ప్రజలు తెలిపారు. ప్రజాభిప్రాయ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు జీసీసీ అధికారులు తెలిపారు.