EVMs Hacking: ఈవీఎంల హ్యాకింగ్‌పై అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-04-08T19:53:32+05:30 IST
ఈవీఎంల హ్యాకింగ్ వ్యవహారం సమయం సందర్భం వచ్చినప్పుడల్లా రాజకీయ తెరపై ప్రత్యక్షమవుతుంటుంది. దీనిపై విపక్షాల..
న్యూఢిల్లీ: ఈవీఎంల హ్యాకింగ్ (EVMs Hacking) వ్యవహారం సమయం సందర్భం వచ్చినప్పుడల్లా రాజకీయ తెరపై ప్రత్యక్షమవుతుంటుంది. దీనిపై విపక్షాల నుంచి ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నారు. ఈ విషయమై మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష ఎన్‌సీపీ నేత అజిత్ పవర్ (Ajit Pawar) శనివారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో క్షుణ్ణంగా తనిఖీలు ఉంటాయని, వ్యక్తిగతంగా వాటిపై తనకు గట్టి నమ్మకం ఉందని అన్నారు. ఈవీఎంలపై విపక్ష పార్టీల నేతలతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అదే పార్టీకి చెందిన అజిత్ పవార్ తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిప్ ఉన్న ఏ మిషన్‌నైనా హ్యాక్ చేయవచ్చంటూ శరద్ పవార్ ఇటీవల వ్యాఖ్యానించారు.
హ్యాకింగే నిజమైతే...
ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చంటూ విపక్ష నేతలు చేస్తున్న వాదనలను అజిత్ పవార్ కొట్టివేశారు. ''ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని ఎవరైనా నిరూపిస్తే దేశంలో తీవ్ర అలజడి రేగుతుంది. ఇందుకు ఎవరూ సాహసిస్తారని నేను అనుకోను. ఒక్కోసారి కొందరు ఎన్నికల్లో ఓడిపోతారు. అయితే తాము ఓడిపోలేదనే ఆలోచనతో వారుంటారు. అప్పుడు ఈవీఎంలపై ఆరోపణలకు దిగుతారు. అయితే, ఈవీఎంలలో వచ్చే తీర్పే.. నిజమైన ప్రజా తీర్పు'' అని ఆయన అన్నారు. దేశంలోని ఈవీఎంలను తారుమారు చేయడం సాధ్యంకాదని, ఇది చాలా పెద్ద వ్యవస్థ అని, అనేకమైన చెక్స్ అండ్ బాలెన్సెస్ ఉంటాయని చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం కుదిరితే విపక్ష పార్టీలు పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవి కావని అన్నారు.