Pakistan : పాక్ బడ్జెట్ అంచనాల లోగుట్టును కనిపెట్టిన ఐఎంఎఫ్
ABN , First Publish Date - 2023-01-28T18:02:57+05:30 IST
పాకిస్థాన్ బడ్జెట్ అంకెల గారడీని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) కనిపెట్టింది. 2022-23 బడ్జెట్ అంచనాల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ బడ్జెట్ అంకెల గారడీని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) కనిపెట్టింది. 2022-23 బడ్జెట్ అంచనాల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల మేరకు గారడీ జరిగినట్లు గుర్తించింది. పాక్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో ఐఎంఎఫ్ ప్రారంభ మదింపు వల్ల ఆ దేశ బడ్జెట్ లోటు మరింత పెరగబోతోంది.
పాకిస్థాన్‌కు ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ క్రింద తొమ్మిదో సమీక్షను ఆ దేశ అధికారులు, ఐఎంఎఫ్ అధికారులు మంగళవారం నుంచి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆర్థికపరమైన లోటుపాట్లు, లెక్కల్లో సర్దుబాట్లు వంటివి కూడా వీరు చర్చిస్తారు. సెప్టెంబరు నుంచి ఈ సమీక్ష వాయిదా పడుతూ వస్తోంది. ఇది పూర్తయితే తదుపరి ఆర్థిక సాయాన్ని ఐఎంఎఫ్ విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది.
2022-23 పాకిస్థాన్ బడ్జెట్ ప్రకటనలో బడ్జెట్ లోటు జీడీపీలో 4.9 శాతం వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే మినీ బడ్జెట్ ద్వారా రూ.600 బిలియన్ మేరకు పన్నులు విధించాలని పాకిస్థాన్‌ను ఐఎంఎఫ్ కోరుతోంది. కానీ పాకిస్థాన్ దీనికి అంగీకరించడం లేదు. ప్రైమరీ డెఫిసిట్ ఆ మేరకు పెరగబోదని వాదిస్తోంది. రూ.2 లక్షల కోట్ల మేరకు బడ్జెట్ గారడీ కనిపిస్తున్నందువల్ల ప్రైమరీ, బడ్జెట్ డెఫిసిట్లు పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరిస్తోంది.
ఇదిలావుండగా, వరదల వల్ల నష్టపోయామని చెప్తూ, బడ్జెట్ లోటును లెక్కించేటపుడు రూ.500 బిలియన్ల మేరకు మినహాయించాలని ఐఎంఎఫ్‌ను పాకిస్థాన్ కోరుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రైమరీ డెఫిసిట్‌ను లెక్కించేటపుడు ఈ మినహాయింపును ఇవ్వాలని కోరుతోంది. కానీ ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం పాకిస్థాన్ జీడీపీలో ప్రైమరీ డెఫిసిట్ టార్గెట్ 0.2 శాతానికి, అంటే 1 లక్ష కోట్ల రూపాయలకు మించిపోయే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించాయి. రుణాలను తిరిగి చెల్లించలేని దుస్థితికి చేరకుండా ఆపగలిగిన ఏకైక వ్యవస్థ ఐఎంఎఫ్ మాత్రమే. అయితే సంక్షోభం నుంచి బయటపడటానికి దీర్ఘకాలిక ప్రణాళికలేవీ పాకిస్థాన్ వద్ద కనిపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.