Congress-NC big Win: 370 అధికరణ రద్దు తర్వాత తొలి ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సీ విజయకేతనం...
ABN , First Publish Date - 2023-10-08T20:33:11+05:30 IST
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత తొలిసారి జరిగిన కార్గిల్ లోని లడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఓడించింది.
లడఖ్: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత తొలిసారి జరిగిన కార్గిల్ (Kargil)లోని లడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్ (Ladakh Autonomous Hill Council) ఎన్నికల్లో బీజేపీ(BJP)ని కాంగ్రెస్(Congress), నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) కూటమి ఓడించింది. 26 సీట్ల లడఖ్ కౌన్సిల్స్‌కు ఆదివారంనాడు జరిగిన కౌంటింగ్‌లో సాయంత్రానికి 22 సీట్ల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోగా, నేషనల్ కాన్ఫరెన్స్ 11 సీట్లు సాధించింది. బీజేపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఒక సీటు స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు.
ఇది సెక్యులర్ పార్టీల విజయం: మెహబూబా ముఫ్తీ
నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వంటి సెక్యులర్ పార్టీలు కార్గిల్‌లో విజయం సాధించడం ఎంతో హృద్యంగా ఉందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ వ్యాఖ్యానించారు. 2019 తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవని, లడఖ్ ప్రజలు ఓటుతోనే మాట్లాడారని ఓవైపు ఫలితాలు వెలువడుతుండగానే ముఫ్తీ ఒక ట్వీట్‌లో తెలిపారు. ట్రెండ్స్ ప్రకారం కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమైనట్టు కనిపిస్తోందన్నారు.