Rare Surgery : యువకునికి అరుదైన శస్త్ర చికిత్స.. తలలోకి దూసుకెళ్లిన రెండు అంగుళాల మేకు తొలగింపు..

ABN , First Publish Date - 2023-07-15T12:13:53+05:30 IST

తమిళనాడులోని చెన్నై నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. 23 ఏళ్ల యువకుడి తలలో గుచ్చుకున్న రెండు అంగుళాల పొడవైన మేకును ఆరు గంటలపాటు శ్రమించి, తొలగించారు. బాధితుడు రెండు రోజుల్లోనే తనంతట తాను నడుస్తూ వచ్చి, మీడియాతో మాట్లాడగలిగారు.

Rare Surgery : యువకునికి అరుదైన శస్త్ర చికిత్స.. తలలోకి దూసుకెళ్లిన రెండు అంగుళాల మేకు తొలగింపు..

చెన్నై : తమిళనాడులోని చెన్నై నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. 23 ఏళ్ల యువకుడి తలలో గుచ్చుకున్న రెండు అంగుళాల పొడవైన మేకును ఆరు గంటలపాటు శ్రమించి, తొలగించారు. బాధితుడు రెండు రోజుల్లోనే తనంతట తాను నడుస్తూ వచ్చి, మీడియాతో మాట్లాడగలిగారు. తాను సాధారణ స్థితికి చేరుకున్నానని, తాను తినడం, నడవడం, మాట్లాడటం మామూలుగానే చేయగలుగుతున్నానని చెప్పారు. తిరిగి ఉద్యోగానికి వెళ్లడం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.

ఉత్తర ప్రదేశ్‌లోని మచలిగావ్‌కు చెందిన బ్రహ్మ (23) చెన్నైలో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. ఈ నెల 4న ఆయన సహోద్యోగి చేతిలోని నెయిల్ గన్ అకస్మాత్తుగా ప్రమాదవశాత్తూ వెనుకకు దూసుకెళ్లడంతో రెండు అంగుళాల పొడవైన మేకు బ్రహ్మ తలలోకి దూసుకెళ్లింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆరు గంటలపాటు శ్రమించి, ఆయన తలలోని మేకును తొలగించారు. రెండు రోజుల్లోనే ఆయన పరిస్థితి సాధారణ స్థితికి చేరడంతో ఈ నెల ఆరున ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ మర్నాడే ఆయన ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ రూమ్‌లో విలేకర్లతో నవ్వుతూ మాట్లాడారు. తన తలలోని మేకును వైద్యులు తొలగించారని, తాను తినడం, నడవడం, మాట్లాడటం వంటి పనులను మామూలుగానే చేయగలుగుతున్నానని చెప్పారు. తాను బాగున్నానని, తిరిగి ఉద్యోగానికి వెళ్లడం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.

నవలూరులోని ఓ ఫ్యాక్టరీ ప్యాకేజింగ్ యూనిట్‌లో నేలను బ్రహ్మ తుడుస్తూ ఉండగా, కర్రతో చేసిన పెట్టెలకు ఆయన సహోద్యోగి నెయిల్ గన్‌తో సీలు వేస్తున్నపుడు ఈ ప్రమాదం జరిగింది. తన తల వెనుక హఠాత్తుగా, తీవ్రమైన నొప్పి కలుగుతోందని బ్రహ్మ చెప్పారు. వెంటనే అక్కడ ఉన్నవారు పరిశీలించినపుడు ఆయన తల నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించారు. ఆ మేకు ఆయన తల, మెడ మధ్య భాగంలో ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే బ్రహ్మను రేలా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన స్పృహలోనే ఉన్నారు. ఆసుపత్రి కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ ఎం అంబుసెల్వం మాట్లాడుతూ, ఆసుపత్రికి చేరుకునేసరికి బ్రహ్మ కాళ్లు, చేతులు బలహీనపడలేదని చెప్పారు. రక్తపోటు, పల్స్ రేటు సాధారణ స్థితిలోనే ఉన్నాయన్నారు. ఆయన వయసు కూడా అతి పెద్ద సానుకూలత అయిందన్నారు. అయితే ఈ మేకు ఆయన శరీరంలో చర్మం క్రింద దాదాపు అర అంగుళం లోతులో గుచ్చుకుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా మాట్లాడటంలో ఇబ్బందులు, పక్షవాతం లేదా మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. కర్రలో దిగ్గొట్టినపుడు సులువుగా బయటకు రాకూడదనే లక్ష్యంతో ఈ మేకును తయారు చేసినందువల్ల దీనిని తలలో నుంచి తీయడం కూడా కష్టమేనని చెప్పారు. ఆయన బోర్లా పడుకుని ఉండగా శస్త్ర చికిత్స చేయడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేకు చుట్టూ సున్నితంగా తొలచి రంధ్రం చేసినట్లు చెప్పారు. దీని కోసం ప్రత్యేకమైన పరికరాలను వాడినట్లు తెలిపారు. సున్నితంగా తొలచి, నెమ్మదిగా ఆ మేకును బయటకు తీయగలిగామని చెప్పారు.

శస్త్ర చికిత్స పూర్తయిన తర్వాత బ్రహ్మకు స్పృహ వచ్చిందని, అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. కాళ్లు, చేతులను ఇబ్బంది లేకుండా కదిలించగలిగినట్లు చెప్పారు. ఆయనను రెండో రోజునే డిశ్చార్జ్ చేసినట్లు రేలా ఆసుపత్రి సీఈఓ డాక్టర్ ఇలంకుమరన్ కలియమూర్తి చెప్పారు. ఆయన తిరిగి ఉద్యోగానికి వెళ్లవచ్చునని వైద్యులు ప్రకటించారని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Price hike : ధరల పెరుగుదలకు కారణం మియా ముస్లింలే : హిమంత బిశ్వ శర్మ

Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు

Updated Date - 2023-07-15T12:37:48+05:30 IST