Yogi Adityanath: ఆరేళ్లలో 183 ఎన్‌కౌంటర్లు.. మాఫియా డాన్‌ల పాలిట సింహస్వప్నం

ABN , First Publish Date - 2023-04-14T16:01:39+05:30 IST

2017 మార్చ్ నుంచి ఇప్పటివరకూ 183 మంది క్రిమినల్స్‌ను యూపీ పోలీసులు మట్టుబెట్టారు.

Yogi Adityanath: ఆరేళ్లలో 183 ఎన్‌కౌంటర్లు.. మాఫియా డాన్‌ల పాలిట సింహస్వప్నం
In Uttar Pradesh in last six years 183 criminals were killed in encounters

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 2017లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి (Uttar Pradesh Chief Minister) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. డాన్‌లను, క్రిమినల్స్‌ను, గూండాలను, రౌడీలను ఏమాత్రం ఉపేక్షించడం లేదు. అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు సరిచేయడంపై దృష్టిపెట్టిన యోగి గ్యాంగ్‌స్టర్స్ యాక్ట్ తీసుకొచ్చారు. దీని ప్రకారం 50 వేల మంది క్రిమినల్స్‌కు చెందిన ఆస్తులను సీజ్ చేశారు. గూండా యాక్ట్ కూడా తీసుకొచ్చారు. 2017 మార్చ్ 20 నుంచి ఇప్పటివరకూ 23 వేల మందికి పైగా అరెస్ట్ చేశారు. క్రిమినల్స్‌ను వేటాడే క్రమంలో 4911 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 1424 మంది పోలీసులున్నారు.

2017 మార్చ్ నుంచి ఇప్పటివరకూ 183 మంది క్రిమినల్స్‌ను యూపీ పోలీసులు మట్టుబెట్టారు.

2017లో 28

2018లో 41

2019లో 34

2020లో 26

2021లో 26

2022లో 14

2023లో 14

ఎదురుకాల్పుల ఘటనల్లో 13 మంది పోలీసులు కూడా చనిపోయారు.

ఇటీవలి ఎన్‌కౌంటర్లు

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్(Umeshh pal) అనే న్యాయవాదిని ప్రయాగ్‌రాజ్‌లో ఆయన నివాసం వెలుపల పట్టపగలు (Gangster politician Atiq Ahmed) కుమారుడు అసద్(Asad), అతడి సహచరుడు గులాం(Ghulam) కాల్పులు జరిపి హత్య చేశారు. వీరి కాల్పుల్లో ఉమేశ్‌పాల్‌కు రక్షణ కల్పిస్తున్న ఇద్దరు పోలీస్ సిబ్బంది కూడా చనిపోయారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ సాక్షి. ఉమేశ్ పాల్ హత్య కేసును యూపీ సర్కార్ ఒక సవాలుగా తీసుకుంది. మాఫియా నేతలను మట్టిలో కలిపేస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రతిన కూడా చేశారు. ఆ తర్వాత పోలీసులు వేట మొదలుపెట్టారు.

ఉమేశ్ పాల్ హత్య తర్వాత అసద్, గులాం లక్నో పారిపోయారు. ఆ తర్వాత కాన్పూర్‌కు, మీరట్‌కు, ఢిల్లీకి వెళ్లినట్లు కూడా తెలిసింది. వీరిద్దరి తలపై ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల రివార్డ్ కూడా ప్రకటించింది. సినీ ఫక్కీలో తన తండ్రిని పోలీస్ కాన్వాయ్‌ నుంచి తప్పించాలని ఝాన్సీ బోర్డర్ వద్ద అసద్ కాపు కాసినట్లు పోలీసులకు తెలిసింది. పోలీసులు తమను గుర్తించినట్లుగా అనుమానించిన వీరిద్దరూ బైక్‌పై పారిపోయేందుకు యత్నించారు. చివరకు అసద్, అతడి సహచరుడు గులాం ఎన్‌కౌంటర్ అయ్యారు. వీరి వద్ద నుంచి పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు డీఎస్పీ ర్యాంక్ అధికారులతో పాటు మొత్తం 12 మంది పోలీసులు పాల్గొన్నారు. నిందితులపై మొత్తం 42 రౌండ్ల బుల్లెట్ల కాల్పులు జరిపారు.

ఎమ్మెల్యేగా ఐదుసార్లు, సమాజ్‌వాదీ పార్టీ(SP) తరపున ఒకసారి ఎంపీగా కూడా గెలిచిన అతిఖ్ అహ్మద్‌పై వందకు పైగా కేసులున్నాయి. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసుతో పాటు (BSP MLA Raju Pal) ఇటీవల జరిగిన మరో ఘటనతోనూ అతీఖ్‌కు సంబంధాలున్నాయి. తన తమ్ముడిని ఓడించాడనే కసితో ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజు పాల్‌ను 3 నెలలకే చంపేశాడు. అప్పటికి రాజు పాల్‌కు వివాహమై 9 రోజులు మాత్రమే. నాడు రాజు పాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్‌పాల్‌ను హతమార్చిన కేసులో అతీఖ్, అతడి సోదరుడికి ప్రయాగ్‌రాజ్ ఎంపీ, ఎమ్మెల్యేల న్యాయస్థానం 14 రోజుల పోలీస్ రిమాండ్ విధించింది.

నిజానికి అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ ఎన్‌కౌంటర్ జరగవచ్చని ప్రచారం జరిగింది. దీంతో గుజరాత్ సబర్మతి జైలు నుంచి యూపీ ప్రయాగ్ రాజ్‌కు రోడ్డు మార్గం గుండా 1270 కిలోమీటర్ల వరకూ ప్రత్యేక వాహనాల్లో వీరిద్దరినీ తీసుకువస్తుండగా బంధువులు కూడా పోలీస్ కాన్వాయ్ వెంట వచ్చారు. అయితే అనూహ్యంగా అతీఖ్ తనయుడు అసద్ ఎన్‌కౌంటరయ్యాడు.

యూపీలో శాంతి భద్రతలు మెరుగుపరిచేందుకే తాము క్రిమినల్స్ అంతుచూస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-14T16:02:31+05:30 IST