Income Tax Department: మళ్లీ రాష్ట్రంలో ఐటీ కలకలం

ABN , First Publish Date - 2023-02-15T08:57:03+05:30 IST

రాష్ట్రంలో మళ్లీ ఐటీ(Income Tax) కలకలం రేగింది. మంగళవారం ఒకేరోజు ఒకే సమయంలో 200 మందికి పైగా అధికారులు రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో

Income Tax Department: మళ్లీ రాష్ట్రంలో ఐటీ కలకలం

- నాలుగు సంస్థల్లో అధికారుల తనిఖీ

- పలు కీలక పత్రాల స్వాధీనం!

చెన్నై, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ ఐటీ(Income Tax) కలకలం రేగింది. మంగళవారం ఒకేరోజు ఒకే సమయంలో 200 మందికి పైగా అధికారులు రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‏లు, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఆదాయపన్ను సరిగ్గా చెల్లించడం లేదనే ఆరోపణలు రావడంతో తాము ఈ తనిఖీలు చేపట్టినట్లు ఐటీ అధికారులు తెలిపారు. అశోక్‌ గ్రూపు సంస్థలు, అంబాలాల్‌ గ్రూప్‌, ఆదిత్యరాం బిల్డర్స్‌, కేకేఎం కళాశాల గ్రూపు సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు, వాటి యజమానులు, బంధుమిత్రుల నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. చెన్నై, కాంచీపురం, వేలూరు, తిరునల్వేలి(Chennai, Kanchipuram, Vellore, Thirunalveli) తదితర ప్రాంతాల్లోని నివాసాల్లో ఈ సోదాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. చెన్నైలో అన్నానగర్‌ వెస్ట్‌ 6వ అవెన్యూ, పోరూర్‌, శ్రీపెరంబుదూర్‌, రాజన్‌నగర్‌లో వున్న, పుదుపాక్కం తదితర ప్రాంతాల్లోని కార్యాలయాలు, నివాసాల్లో తనిఖీలు జరిగాయి. ప్రత్యేక రిజర్వ్‌ బలగాల భద్రత నడుమ మంగళవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఈ తనిఖీలు చేపట్టారు. 2021 నుంచి 2022 వరకు సక్రమంగా ఆదాయ పన్ను చెల్లించలేదని ఆరోపణలున్నాయి. కొన్ని సంస్థలు తమ ఆదాయానికి తప్పుడు లెక్కలతో తక్కువ పన్ను చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈ సోదాలు జరిగిన వాటిల్లో దివాలా తీసినట్లు ప్రకటించుకున్న కొన్ని సంస్థలు.. ఇతర సంస్థల్లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఆరోపణలున్నాయి. కోట్లాది రూపాయలు పన్నుఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అధికారులు రంగంలోకి దిగారు. ఇదిలా వుండగా తమిళనాడులో 30 చోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు.. ఈ సంస్థలకు చెందిన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని 30 కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

ఇదికూడా చదవండి: ప్రభాకరన్‌ బతికే ఉన్నాడన్న ఈ పెద్దాయన పరిస్థితి ఇప్పుడేంటంటే..

Updated Date - 2023-02-15T08:57:04+05:30 IST