Income Tax Department: మరోసారి ఐటీ కలకలం.. విస్తారా టెక్స్‌టైల్స్‌లో తనిఖీలు
ABN , First Publish Date - 2023-11-17T11:43:53+05:30 IST
నగరంలో ఆదాయపన్ను శాఖ అధికారులు మరోమారు తనిఖీలకు దిగారు. కేకే నగర్ కేంద్రంగా వస్త్ర దుకాణం నడుపుతున్న విస్తారా టెక్స్‌టైల్స్‌తో
అడయార్(చెన్నై): నగరంలో ఆదాయపన్ను శాఖ అధికారులు మరోమారు తనిఖీలకు దిగారు. కేకే నగర్ కేంద్రంగా వస్త్ర దుకాణం నడుపుతున్న విస్తారా టెక్స్‌టైల్స్‌తో పాటు ఆ దుకాణం యజమాని, ఆడిటర్ సహా అనేక మందితోపాటు పదిళ్లల్లో గురువారం ఐటీ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో విస్తారా టెక్స్‌టైల్స్ పన్ను ఎగవేతకు పాల్పడటమేకాకుండా, నకిలీ బిల్లులను తయారుచేసి వాటిని ఆదాయపన్నులో చూపించి తక్కువ మొత్తంలో పన్ను చెల్లించినట్టు గుర్తించారు. ఈ సోదాలు విస్తారా టెక్స్‌టైల్స్ యజమానులు నీలకంఠన్, వెంకటేశన్‌తో పాటు పట్టాలం ప్రాంతానికి చెందిన ఆడిటర్ రాజేష్ కు చెందిన ఇల్లు, కార్యాలయం, ఆలిండియా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న కార్యాలయం, టి.నగర్ రాధాకృష్ణన్ రోడ్డులో ఉన్న పారిశ్రామికవేత్తలు ప్రకాష్, నాగేష్, దినేష్‌ల నివాసాలు, వెప్పేరి రిథర్టన్ రోడ్డుకు చెందిన మరో పారిశ్రామికవేత్త ఇల్లు, కార్యాలయం, గోపాలపురం రత్నా వీధికి చెందిన పారిశ్రామికవేత్తకు చెందిన ఇల్లు, కార్యాలయంతో పాటు నగర వ్యాప్తంగా కేకే నగర్, నుంగంబాక్కం, గోపాలపురం, పట్టాళం, టి.నగర్, వెప్పేరితో పాటు పదికిపైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో విస్తారా టెక్స్‌టైల్స్ దుకాణంలో నకిలీ బిల్లులతో పాటు కీలక దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ దుకాణం యజమానులు నీలకంఠన్, వెంకటేశన్ నివాసాలైన కేకే నగర్ 9వ సెక్టార్‌లో ఉన్న గృహాల నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ప్రకాష్, నాగేష్, దినే్‌షల ఇళ్ల నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.