Tiranga Yatra: గుజరాత్‌లో తిరంగాయాత్రను ప్రారంభించిన అమిత్‌షా
ABN , First Publish Date - 2023-08-13T15:21:50+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన శనివారం నుంచి మూడు రోజుల 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లాలో 'తిరంగా యాత్ర' ను ప్రారంభించారు.
అహ్మదాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన శనివారం నుంచి మూడు రోజుల 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ జిల్లాలో 'తిరంగా యాత్ర' (Tiranga Yatra)ను ప్రారంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భారీ తిరంగా యాత్రలో దేశభక్తి, జాతీయతాభావాలు పెల్లుబికాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వత్సరాలు పూర్తయిందని, ఇప్పుడు ప్రాణత్యాగాలు చేయనక్కరలేదని, కానీ దేశం కోసం జీవించాలని అన్నారు. 2022 ఆగస్టు 15 దేశంలో త్రివర్ణపతాకం ఎగురని ఇల్లు లేదని, ప్రతి ఇంట్లో మువ్వన్నెల పతాకం ఎగుర వేస్తే యావద్దేశం మూడురంగులమయం అవుతుందని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ద్వారా ప్రధాని మోదీ యావద్దేశంలోనూ దేశభక్తి భావనలను పాదుకొలిపారని చెప్పారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ఇండియాను ప్రతి రంగంలోనూ ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు మనమంతా పాటుపడాలని పిలుపునిచ్చారు.
మోదీ పిలుపు...
హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని ప్రధాని మోదీ ఆదివారంనాడు ఒక ట్వీట్‌లో పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రొఫైల్ పిక్చర్‌గా త్రివర్ణపతాకం ఉంచుకోవాలని కోరారు. ప్రధాని కూడా త్రివర్ణ పతాకం బొమ్మను తన ప్రొఫైల్‌లో మార్చుకున్నారు.
77వ ఇండిపెండెన్స్ డే ఏర్పాట్లు
మరోవైపు, 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద వివిధ సాయుధ బలగాలు రిహార్సల్స్ సాగిస్తున్నారు. ఆ దృష్ట్యా వాహనాల రాకపోకలపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు అడ్వయిజరీ జారీ చేశారు. దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోటపై ప్రధానమంత్రి త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 1,800 మంది ప్రత్యేక అతిథులు హాజరవుతున్నారు.