Share News

Republic day: భారత గణతంత్ర వేడుకలకు విశిష్ట అతిథి.. ప్రభుత్వం ఎవరిని ఆహ్వానించిందంటే?

ABN , Publish Date - Dec 22 , 2023 | 12:12 PM

భారత గణతంత్ర వేడుకలకు(India RepublicDay) హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు జులైలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో పర్యటించారు.

Republic day: భారత గణతంత్ర వేడుకలకు విశిష్ట అతిథి.. ప్రభుత్వం ఎవరిని ఆహ్వానించిందంటే?

ఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు(India RepublicDay) హాజరుకావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు జులైలో ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ వేడుకల్లో మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. మాక్రాన్ ఆహ్వానం మేరకు భారత్, ఫ్రాన్స్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పర్యటన జరిగింది.

ఇండియా-ఫ్రాన్స్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, సైనిక బృందం నేతృత్వంలోని 241 మంది సభ్యుల ట్రై-సర్వీస్ ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కవాతులో పాల్గొంది. ఇండియన్ ఆర్మీ కంటెంజెంట్‌కి పంజాబ్ రెజిమెంట్ నాయకత్వం వహించింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత అధ్యక్షతన జరిగిన G20 సమ్మిట్‌లో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మోదీ, మాక్రాన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల పరస్పర సహకారంతో ఉత్పత్తుల రూపకల్పన, విస్తరణ భాగస్వామ్యం ద్వారా రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్నట్లు నేతలు పునరుద్ఘాటించారు. డిఫెన్స్ ఇండస్ట్రీయల్ రోడ్ మ్యాప్ త్వరగా ఖరారు చేయాలని నిర్ణయించారు.

ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ వేడుకలకు ఫ్రెంచ్ నాయకుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి. మాక్రాన్‌కు ముందు, మాజీ ఫ్రెంచ్ ప్రధాని జాక్వెస్ చిరాక్ 1976,1998లో, 1980లో మాజీ అధ్యక్షులు వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్, నికోలస్ సర్కోజీ, ఫ్రాంకోయిస్ హోలాండ్ లు వరుసగా 2008 నుంచి 2016 సంవత్సర మధ్య కాలంలో పాల్గొన్నారు. భారత్, ఫ్రాన్స్ లు రక్షణ, అంతరిక్షం, పౌర అణు, వాణిజ్యం, పెట్టుబడి, విద్య తదితర రంగాల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాయి.

Updated Date - Dec 22 , 2023 | 12:37 PM