Brahmos missile: భారత నావికాదళం బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
ABN , First Publish Date - 2023-11-01T16:26:40+05:30 IST
బంగాళాఖాతంలోని యుద్ధనౌక నుంచి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ను భారత నావికాదళం బుధవారం విజయవంతంగా పరీక్షించింది. కార్యాచరణ సంసిద్ధత కోసం జరిపిన టెస్ట్ ఫైరింగ్ సకాలంలో లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది.
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలోని యుద్ధనౌక నుంచి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ (Brahmos missile)ను భారత నావికాదళం (Indian Navy) బుధవారం విజయవంతంగా పరీక్షించింది. కార్యాచరణ సంసిద్ధత కోసం జరిపిన (Operation preparedness) టెస్ట్ ఫైరింగ్ సకాలంలో లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంది. ఇండియన్ నేవీకి చెందిన తూర్పు కమాండ్‌లోని బంగాళాఖాతంలో ఫైరింగ్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
ఆర్-క్లాస్ డిస్ట్రాయిర్ షిప్, దాని ఆయుధాలు పూర్తిగా దేశీయంగా తయారై ఆత్మనిర్భర్ భారత్‌కు, సముద్రంలో భారత నేవీ ఫైర్ పవర్‌కు సంకేతంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా చైనా పీఎల్ఏ నేవీ నుంచి ఎదురయ్యే ప్రతికూలతలతో సహా అన్ని సవాళ్లను ఇవి సమర్ధవంతంగా ఎదుర్కోనున్నాయి.
సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు
బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం, భారత్-రష్యా సంయుక్త వెంచర్‌గా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిని జలాంతర్గాములు, నౌకలు, విమానాలు, ల్యాండ్ ఫ్లాట్‌ఫాం నుంచి 2.8 మ్యాక్ వేగంతో, దాదాపు మూడు రెట్ల ధ్వని వేగంతో ప్రయోగించవచ్చు. ఫిలిప్పీన్స్ వంటి కొన్ని దేశాలకు కూడా బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఎగుమతి చేస్తోంది.