ADR Report: దేశంలో అత్యంత ధనిక ఎమ్మెల్యే ఎవరో తెలుసా.. ఏడీఆర్ రిపోర్టులో నివ్వెరపోయే విషయాలు..
ABN , First Publish Date - 2023-07-20T20:27:03+05:30 IST
దేశంలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత డేటాను జనాల ముందుంచే ఏడీఆర్ (Association for Democratic Reforms) తాజాగా మరో రిపోర్ట్ విడుదల చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, కనకపుర ఎమ్మెల్యే డీకే శివకుమార్ ఏకంగా రూ.1,400 కోట్ల ఆస్తితో దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత వరుస రెండు స్థానాల్లో కూడా కర్ణాటకకు చెందినవారే కావడం విశేషం.
బెంగళూరు: దేశంలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత డేటాను జనాల ముందుంచే ఏడీఆర్ (Association for Democratic Reforms) తాజాగా మరో రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలోని ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆర్థిక స్థితిపై విడుదల చేసిన ఈ నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆస్తుల విలువ రూ.1,400 కోట్లు కాగా.. ఓ ఎమ్మెల్యే పేరు మీద కనీసం రూ.2 వేలు కూడా లేకపోవడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, కనకపుర ఎమ్మెల్యే డీకే శివకుమార్ ఏకంగా రూ.1,400 కోట్ల ఆస్తితో దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు. ఆ తర్వాత వరుస రెండు స్థానాల్లో కూడా కర్ణాటకకు చెందినవారే కావడం విశేషం. రూ.1,267 కోట్ల విలువైన ఆస్తులతో స్వతంత్ర ఎమ్మెల్యే కేహెచ్ పుట్టస్వామి గౌడ రెండవ స్థానంలో నిలిచారు. ఇక రూ.1156 కోట్ల విలువైన ఆస్తులతో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియ కృష్ణ మూడో స్థానంలో ఉన్నారని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. ఇక మైనింగ్ డాన్‌గా పేరున్న గాలి జనార్థన్ రెడ్డి సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో 23వ స్థానంలో నిలిచారు.
బెంగాల్ ఎమ్మెల్యే ఆస్తి విలువ రూ.1700
మరోవైపు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధార తన ఆస్తులు విలువ కేవలం రూ.1700 గా డిక్లేర్ చేశారు. ఇక ఒడిశాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే మకరంద ముడులి ఆస్తుల విలువ రూ.15 వేలు, పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే నరీందర్ పాల్ సింగ్ ఆస్తి విలువ రూ.18,370గా ఉన్నాయని ఏడీఆర్ రిపోర్ట్ తెలిపింది.
తన ఆస్తుల గురించి డీకే శివ కుమార్ స్పందిస్తూ... తాను ధనవంతుడినీ కాదు, అలాగనీ పేదవాడినీ కాదని వ్యాఖ్యానించారు. సుదీర్ఘకాలంలో ఈ ఆస్తులను సంపాదించానని, వ్యక్తిగత పేరు మీద ఈ ఆస్తులు ఉన్నాయని, అలాగే ఉంచానన్నారు. కాగా టాప్-10 సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో నలుగురు కాంగ్రెస్ పార్టీకి (Congress) చెందినవారు కాగా ముగ్గురు బీజేపీకి (BJP) చెందినవారు కావడం గమనార్హం. దీంతో ఈ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.
ఇక దేశంలో టాప్ -20 సంపన్న ఎమ్మెల్యేల్లో 12 మంది కర్ణాటకకు చెందినవారే. ఇక కర్ణాటక ఎమ్మెల్యేల్లో 14 శాతం మంది బిలియనీర్లే కావడం గమనార్హం. కనీసం రూ.100 కోట్లకుపైగా ఆస్తులున్నవారిని బిలియనీర్లుగా పరిగణించగా.. అరుణాచల్‌ప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలోని 59 మంది ఎమ్మెల్యేల్లో 4 నలుగురు బిలియనీర్లు కావడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షత్ స్పందిస్తూ.. డీకే శివకుమార్ లాంటి వారు వ్యాపారం చేస్తారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఒకసారి చూడండి. ముఖ్యంగా మైనింగ్ స్కామ్స్‌లో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేల ఆస్తుల విలువ ఎంతో గమనించాలని ఆరోపించారు. ఈ ఆరోపణలపై బీజేపీ కౌంటర్‌గా స్పందిస్తూ... కాంగ్రెస్ పార్టీ సంపన్నులను మాత్రమే ఇష్టపడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.