Share News

Indira Canteens: కొత్త ఏడాది నుంచి.. ఇందిరా క్యాంటీన్లలో కొత్త మెనూ

ABN , Publish Date - Dec 23 , 2023 | 09:55 AM

బెంగళూరు నగర వ్యాప్తంగా ఇందిరా క్యాంటీన్ల(Indira Canteens)లో నూతన ఏడాది నుంచి కొత్త మెనూ అమల్లోకి రానుంది. ఈ మెనూలో రాగిముద్ద, మంగళూరు బన్స్‌, బిసిబెళెబాత్‌ వంటివి ఉంటాయని బీబీఎంపీ అధికారి ఒకరు శుక్రవారం మీడియాకు చెప్పారు.

Indira Canteens: కొత్త ఏడాది నుంచి.. ఇందిరా క్యాంటీన్లలో కొత్త మెనూ

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగర వ్యాప్తంగా ఇందిరా క్యాంటీన్ల(Indira Canteens)లో నూతన ఏడాది నుంచి కొత్త మెనూ అమల్లోకి రానుంది. ఈ మెనూలో రాగిముద్ద, మంగళూరు బన్స్‌, బిసిబెళెబాత్‌ వంటివి ఉంటాయని బీబీఎంపీ అధికారి ఒకరు శుక్రవారం మీడియాకు చెప్పారు. ఉదయం పూట అందించే అల్పాహారంలో బ్రెడ్‌ జామ్‌ను కూడా తాజాగా చేర్చారు. మామిడి కాయల సీజన్‌లో వీటితో తయారైన ఆహార పదార్థాన్ని అందించనున్నారు. ఇందిరా క్యాంటీన్ల నిర్వహణకు తాజాగా బీబీఎంపీ టెండర్లను ఆహ్వానించింది. జనవరి 16 నుంచి వినియోగదారులకు కొత్త మెనూ లభించనుందని సదరు అధికారి వివరించారు. ఇందిరాక్యాంటీన్ల పేరుతో మొబైల్‌ వాహనాలను, ప్రత్యేక క్యాంటీన్లను నగరంలోని అన్ని వార్డుల్లోనూ నిర్వహిస్తున్న సంగతి విదితమే. నిరుపేదలు, కూలీ కా ర్మికులు ఇందిరా కాంటీన్ల ద్వారా తక్కువ ఖర్చుతో తమ కడుపు నింపుకుంటున్నారన్నారు. టెండర్లను దక్కించుకునే వారు నాణ్యమైన బియ్యం, నూనె, గోధుమ పిండినే వాడాలని షరతు విధించామని, వీటిని ఉల్లంఘిస్తే టెండర్లను రద్దుచేసే అధికారం తమకు ఉంటుందని చెప్పారు. ఇందిరా క్యాంటీన్లలో ఉదయం పూట ఉదయం 7 గంటల నుంచి 10 వరకు రూ. 5 కే టిఫిన్‌ అందిస్తున్నారు. మొత్తం 10 రకాల టిఫిన్‌ను రొటేషన్‌ పద్ధతిలో వినియోగదారులకు ఇస్తున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు అందించే భోజనంలో అన్నం, రాగి ముద్ద, చపాతీలు, తిరిగి రాత్రి 7-30 నుంచి 9 వరకు అందించే భోజనంలోనూ దాదాపు ఇవే పదార్థాలను కేవలం రూ.10కే అందిస్తున్నారు. ఇందిరాక్యాంటీన్లలో అందించే ఆహారపదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు బీబీఎంపీ ప్రత్యేక నిఘా బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.

Updated Date - Dec 23 , 2023 | 10:36 AM