Amritpal: అమృత్‌పాల్ కోసం మూడోరోజూ కొనసాగుతున్న వేట.. ఇంటర్నెట్ సేవలపై నిషేధం పొడిగింపు

ABN , First Publish Date - 2023-03-20T14:24:48+05:30 IST

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ సోమవారంనాడు..

Amritpal: అమృత్‌పాల్ కోసం మూడోరోజూ కొనసాగుతున్న వేట.. ఇంటర్నెట్ సేవలపై నిషేధం పొడిగింపు

చండీగఢ్: ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal) కోసం పంజాబ్ పోలీసులు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ సోమవారంనాడు మూడోరోజుకు చేరింది. అతను పరారీలో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా నిలిపివేసిన మొబైల్ ఇంటర్నెట్ సేవల గడువును ఈనెల 21వ తేదీ వరకూ పొడిగించారు. ప్రజా భద్రత దృష్ట్యా.. మొబైల్ నెట్‌వర్క్‌లు అందించే వాయిస్ కాల్స్, బ్యాంకింగ్, మొబైల్ రీచార్జ్ మినహా అన్ని ఎస్ఎంఎస్ సర్వీసులు, డాంగిల్ సర్వీసులు మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు పంజాబ్ హోం, న్యాయశాఖ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమృత్ పాల్ సింగ్ అంకుల్, డ్రైవర్ ఆదివారం రాత్రి పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన క్రమంలో ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు.

పంజాబ్‌లో ఘటనల క్రమం..

-అమృత్‌పాల్ సింగ్ అరెస్టుకు గాలింపు చర్యలు జరుగుతున్నాయని, 'వారిస్ పంజాబ్ దే' (పంజాబ్ వారసులం) సంస్థ చీఫ్ పరారీలో ఉన్నాడని పంజాబ్ పోలీసులు తొలుత ప్రకటించారు. సోమవారం ఉదయం వరకూ మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీసులు సస్పెండ్ చేశారు.

-అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసినట్టు ఆయన తరఫు లాయర్ ఇమాన్ సింగ్ ఖారా చేసిన వాదనను పంజాబ్ పోలీసులు ఆదివారంనాడు తోసిపుచ్చారు.

-అమృత్‌పాల్ పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెబుతున్నప్పటికీ ఆయనను షోకోట్ పోలీస్ స్టేషన్ వద్ద అరెస్టు చేసినట్టు ఇమాన్ సింగ్ ఖారా తెలిపారు.

-నకిలీ ఎన్‌కౌంటర్‌లో అమృత్‌పాల్‌ను చంపాలనుకుంటున్నారని ఇమాన్ సింగ్ ఆరోపించారు.

-అమృత్ పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టడంతో పంజాబ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

-అమృత్‌పాల్ సహచరుల నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాల కేసులో సింగ్, అతని అనుచరులపై తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

-శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసేందుకు ముందస్తు చర్యగా పలువురుని పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2023-03-20T14:24:48+05:30 IST