Kapil sibal: మోదీజీ..ఎల్పీజీ ధర తగ్గింపు ఉచితాల సంస్కృతి కాదా?.. నిలదీసిన కపిల్ సిబల్
ABN , First Publish Date - 2023-08-30T17:38:29+05:30 IST
గృహావసరాలకు వినియోగించే వంటగ్యాసు (ఎల్పీజీ) సిలెండర్ ధరను కేంద్రం తగ్గించడంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ నిశిత విమర్శ చేశారు. ఇది ''ఉచితాల సంస్కృతి'' కాదా? అని నిలదీశారు. పేదలు ఇప్పటికి గుర్తొచ్చారా అని ప్రధానిని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: గృహావసరాలకు వినియోగించే వంటగ్యాసు (LPG) సిలెండర్ ధరను కేంద్రం తగ్గించడంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ (Kapil Sibal) నిశిత విమర్శ చేశారు. ఇది ''ఉచితాల సంస్కృతి'' (revri culture) కాదా? అని నిలదీశారు.
ఎల్‌పీజీ సిలెండర్ ధరను రూ.200 తగ్గిస్తూ కేంద్ర క్యాబినెట్ మంగళవారం నిర్ణయం తీసుకోగా, బుధవారం నుంచి ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది. రాఖీ పండుగ కానుకగా మోదీ ప్రభుత్వం ఈ చర్యను అభివర్ణించుకుంది. దీనిపై కపిల్ సిబల్ విమర్శలు గుప్పించారు. ''మోదీజీ...ఉజ్వల్‌కు రూ.400 ఉపశమనం కల్పించడం ఉచితాల సంస్కృతి కాదా? పేదింటి ప్రజలకు ఇది ఉద్దేశించినట్టు అనుకుంటున్నాను. ఇప్పటికైనా మీకు వాళ్లు గుర్తొచ్చినందుకు అభినందిస్తున్నాను. 2024 దగ్గరకు వచ్చేసరికి వాళ్లు మీకు మరింత బాగా గుర్తొస్తారని కచ్చితంగా చెప్పగలను. కానీ, విపక్ష పార్టీలు పేదలకు ఉపశమనం కలిపిస్తే మాత్రం దానిని ఉచితాల సంస్కృతంటూ ఎద్దేవా చేస్తుంటారు. జై హో..!" అంటూ కపిల్ సిబల్ ట్వీట్ చేసారు.
యూపీఏ 1,2 ప్రభుత్వాల హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గత ఏడాది మేలో కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అన్యాయాలపై పోరాటానికి 'ఇన్సాఫ్' అనే రాజకీయేతర ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు.