Chandrayaan-4: జాబిల్లిపై మరో ప్రయోగం.. చంద్రయాన్-4 ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-08-24T14:24:24+05:30 IST

చంద్రయాన్ మిషన్ ఇక్కడితో ఆగిపోయేది కాదు. చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ప్రయోగాన్ని కూడా ఇస్రో త్వరలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును జపాన్‌తో కలిసి భారత్ చేపడుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు చంద్రయాన్-4 లేదా లుపెక్స్ అని నామకరణం చేసే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలియజేశాయి.

Chandrayaan-4: జాబిల్లిపై మరో ప్రయోగం.. చంద్రయాన్-4 ఎప్పుడంటే..?

చందమామపై భారత్ చేపట్టిన చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇస్రో సైంటిస్టుల కృషి ఫలితంగానే భారత్ ఈ విజయం సాధించిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. చంద్రయాన్ మిషన్ ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఎందుకంటే చంద్రయాన్ మిషన్‌కు ఘనమైన లక్ష్యం ఉంది. అందుకే చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ప్రయోగాన్ని కూడా ఇస్రో త్వరలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును జపాన్‌తో కలిసి భారత్ చేపడుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు చంద్రయాన్-4 లేదా లుపెక్స్ అని నామకరణం చేసే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలియజేశాయి.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) కలిసి త్వరలోనే చేపట్టే ఈ ప్రయోగాన్ని లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (లుపెక్స్) లేదా చంద్రయాన్-4 అని పిలవనున్నారు. 2026-2028 మధ్య కాలంలో ఈ ప్రాజెక్టు సాకారం అయ్యే ఛాన్స్ కనిపిస్తోందని తెలిపాయి. అయితే ఈ ప్రయోగం అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది. చంద్రుడిపై నిజంగానే నీరు ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పనుంది. చంద్రయాన్-4 ప్రయోగం జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా సాగనుంది. ఇందులో కూడా ల్యాండర్, రోవర్ ఉంటాయి. ఇవి జాబిల్లి ఉపరితలంపై మంచు రూపంలో ఉన్న నీరు, ఇతర మూలకాల విస్తృతిపై పరిశోధనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కొన్ని పరిశోధనలలో చంద్రుడిపై నీటి బిందువులు కనిపించాయి. చంద్రుడిపై నీటి ఉనికి భవిష్యత్‌లో అంతరిక్ష పరిశోధనలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఖగోళంలో ఇతర గ్రహాలపై మనిషి ఉనికిని కొనసాగించడానికి ఈ నీరు విలువైన వనరుగా ఉపయోగపడుతుంది. లుపెక్స్ ఇలాంటి ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలను అందించడంలో ట్రయల్ బ్లేజర్‌గా ఉపయోగపడనుంది. నీటి ఉనికి, సంభావ్య వినియోగం కోసం చంద్రుడిపై ఉండే ధ్రువాలను పరిశోధించడం లుపెక్స్ ప్రాథమిక లక్ష్యం. ఈ మిషన్ రెండు ప్రాథమిక మార్గాల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రుడిపై నీటి వనరుల పరిమాణం, నాణ్యతను నిర్ణయించడం వంటి లక్ష్యాలను లుపెక్స్ ఛేదించనుంది.


చంద్రయాన్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది?

చంద్రుడిపై అధ్యయనాలు చేయడానికి చంద్రయాన్ మిషన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా చంద్రయాన్ 1ను 2008లో ప్రయోగించింది. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రయాన్ 1లో ఆర్బిటర్, ఇంపాక్ట్ ప్రోబ్‌ను ప్రయోగించింది. ఇంపాక్ట్ ప్రోబ్ అక్కడి ఖనిజాల మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ మ్యాప్ ద్వారానే చంద్రుడిపై వాటర్ కంటెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఇస్రో చెప్పింది. అనంతరం 2019లో ఇస్రో చంద్రయాన్ 2 మిషన్‌ను ప్రయోగించింది.

కాగా అంతరిక్ష రంగంలో ఇస్రో విజయాలను చూసి పలువురు నెటిజన్‌లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇస్రో తొలినాళ్లలో ఎద్దులబండి, సైకిళ్లపై రాకెట్, శాటిలైట్ల విడిభాగాలను తీసుకెళ్లేది. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను పంపి చరిత్ర సృష్టించింది. దీంతో ఇస్రో చాలా గ్రేట్ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇస్రో సాధించిన ఈ ఘనత దేశ పౌరులకు ఎంతో గర్వం అంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ఇస్రో చాలా స్ఫూర్తిదాయకం అని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-24T14:27:02+05:30 IST