Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్ర భద్రతకు కేంద్రం సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2023-06-27T21:31:53+05:30 IST

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ యాత్రకు సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (CRPF) భద్రత కల్పిస్తూ ఉండేది. ఇకపై దీనికి బదులుగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) చేత భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్ర భద్రతకు కేంద్రం సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ యాత్రకు సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (CRPF) భద్రత కల్పిస్తూ ఉండేది. ఇకపై దీనికి బదులుగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) చేత భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏటా జరిగే ఈ యాత్ర శనివారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 31తో ముగుస్తుంది.

జమ్మూ-కశ్మీరులోని శ్రీ అమర్‌నాథ్ గుహలో మంచు లింగం సహజసిద్ధంగా ఏర్పడుతుంది. అమరలింగేశ్వరుని దర్శనం కోసం జరిగే ఈ యాత్ర జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజులపాటు జరుగుతుంది. ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ చీఫ్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ సెక్రటరీ సామంత్ గోయల్, జమ్మూ-కశ్మీరు పోలీసు అధికారులు పాల్గొన్నారు. అమర్‌నాథ్ యాత్రలో ఆరు చోట్ల ఐటీబీపీ, బీఎస్ఎఫ్ దళాలను మోహరించి, భద్రత కల్పించాలని నిర్ణయించారు.

అమర్‌నాథ్ యాత్రకు భద్రత కల్పించేందుకు ఐటీబీపీని వినియోగించడం ఇదే తొలిసారి. అమర్‌నాథ్ దేవాలయ మండలి, జమ్మూ-కశ్మీరు పోలీసులు ఇచ్చిన సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలై 8న అమర్‌నాథ్‌లో మెరుపు వేగంతో వరదలు వచ్చినపుడు ఐటీబీపీ జవాన్లు అత్యంత సమర్థవంతంగా చాలా మంది భక్తులను కాపాడారని, అందువల్ల ఈసారి భద్రత బాధ్యతను వారికే అప్పగించాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని మణిపూర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తరలించడం కూడా దీనికి మరొక కారణంగా చెప్తున్నారు. మణిపూర్‌లో మే నెల నుంచి హింసాకాండ జరుగుతోంది, పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి.

కశ్మీరు లోయలోని అమర్‌నాథ్ యాత్ర మార్గంలో భక్తులకు భద్రత కల్పించే బాధ్యతను సీఆర్‌పీఎఫ్‌ కొనసాగిస్తుంది. ఇతర భద్రతా దళాలతో సమన్వయం కుదుర్చుకుని ఈ బాధ్యతను నిర్వహిస్తుంది. ఈ యాత్ర ప్రారంభమైన తర్వాత భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూన్ 9న నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, అమర్‌నాథ్ యాత్ర పొడవునా భక్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశించారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ల నుంచి బేస్ కేంప్ వరకు సకల సదుపాయాలతో భద్రత కల్పించాలని చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్లను తగిన స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని కూడా చెప్పారు. అదనపు వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Putin Offer: వాగ్నర్ గ్రూప్ సైనికులకు పుతిన్ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే...?

Opposition unity : ప్రతిపక్షాల ఐక్యతపై మోదీ వ్యాఖ్యలు

Updated Date - 2023-06-27T21:31:53+05:30 IST