Jack Ma : అందరినీ ఆశ్చర్యపరచిన చైనా కుబేరుడు జాక్ మా నిర్ణయం
ABN , First Publish Date - 2023-01-07T15:42:04+05:30 IST
చైనా ప్రభుత్వం మునుపెన్నడూ లేనంత తీవ్రంగా వ్యవహరిస్తుండటంతో చైనా కుబేరుడు జాక్ మా
న్యూఢిల్లీ : చైనా ప్రభుత్వం మునుపెన్నడూ లేనంత తీవ్రంగా వ్యవహరిస్తుండటంతో చైనా కుబేరుడు జాక్ మా (Jack Ma) తన ఆన్‌లైన్ సామ్రాజ్యంలో వెనుకడుగు వేస్తున్నారు. యాంట్ గ్రూప్ (Ant Group)లో తనకుగల నియంత్రణ హక్కులను వదులుకుంటున్నారు. ఈ కంపెనీ 10 మందికి స్వతంత్ర ఓటింగ్ హక్కులను కల్పించింది. వీరిలో ఈ కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజ్‌మెంట్, సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఈ సర్దుబాటు వల్ల వాటాదారుల ఆర్థిక ప్రయోజనాల్లో ఎటువంటి మార్పులు రావని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ కంపెనీ తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ గణన ప్రకారం, జాక్ మా ఓటింగ్ హక్కులు 6.2 శాతం వరకు ఉండవచ్చునని తెలుస్తోంది.
యాంట్ గ్రూప్ లిస్టింగ్ సత్ఫలితాలు సాధించని పరిస్థితుల్లో 2020లో జాక్ మా చైనీస్ రెగ్యులేటర్లను విమర్శించారు. అప్పటి నుంచి ఆయన చైనాలో కనిపించలేదు. ఆయన తన కుటుంబంతో సహా జపాన్‌లో ఉన్నట్లు కొందరు చెప్తున్నారు. అయితే చైనీస్ రెగ్యులేటర్ల నిబంధనలకు అనుగుణంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేందుకు యాంట్ గ్రూప్ కృషి చేస్తోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ పునరుద్ధరణ కోసం ఈ కంపెనీ మరికొంత కాలం ఎదురుచూడక తప్పదని నియంత్రణ అధికారాల్లో మార్పులనుబట్టి స్పష్టమవుతోంది. చైనాలోని ఏ-షేర్ మార్కెట్‌లో లిస్ట్ అవాలంటే మూడేళ్ళు పడుతుంది. ఎందుకంటే, లిస్టింగ్ కోసం దరఖాస్తు చేసే తేదీకి ముందు గడచిన మూడేళ్ళలో కంట్రోలర్ మార్పు జరగకూడదని నిబంధనలు చెప్తున్నాయి. అదే హాంగ్ కాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అవాలంటే ఓ ఏడాది వేచి చూడవలసి ఉంటుంది.