India-Canada Row: నేను ఆ రెండింటిలో భాగం కాదు, ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు.. కెనడా వివాదంపై జైశంకర్ ఘాటు రిప్లై
ABN , First Publish Date - 2023-09-27T14:52:00+05:30 IST
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్న నేపథ్యంలో.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. ఇదివరకే రాజకీయ ప్రయోజనాల కోసం...
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్న నేపథ్యంలో.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. ఇదివరకే రాజకీయ ప్రయోజనాల కోసం తీవ్రవాదాన్ని నిర్లక్ష్యం చేయకూడదని న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పరోక్షంగా కెనడాకు చురకలంటించారు. తాజాగా ఈ వివాదంపై కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్‌లో ఆయన మరోసారి మాట్లాడారు.
గత కొన్ని సంవత్సరాలుగా కెనడాలో హింస, తీవ్రవాద సంఘటనలతో పాటు వేర్పాటువాద ఉద్యమాలకు సంబంధించిన వ్యవస్థీకృత నేరాలు గణనీయంగా పెరిగాయని జైశంకర్ అన్నారు. ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనని నొక్కి వక్కాణించిన ఆయన.. ఈ నేరాలపై కొందరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ట్రూడో సర్కారుని పరోక్షంగా విమర్శించారు. ఈ సమస్యలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయన్న ఆయన.. వీటితో పాటు కొన్ని నిర్దిష్టమైన నేరాలకు సంబంధించి సమాచారాన్ని కెనడాతో పంచుకున్నామన్నారు. అలాగే.. అప్పగింతల కోసం కెనడాకు తమ ప్రభుత్వం ఎన్నో అభ్యర్థనలు చేసిందని కూడా ప్రస్తావించారు. ఇదే సమయంలో.. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉండొచ్చని ట్రూడో చేసిన ఆరోపణల్ని మరోసారి ఖండించారు.
తన విధానాల ప్రకారం భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదని జైశంకర్ పేర్కొన్నారు. ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంతవరకు కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదన్న ఆయన.. ఒకవేళ నిజ్జర్ హత్యకు సంబంధించి తగిన సమాచారాన్ని అందిస్తే, భారత్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం.. ఫైవ్ ఐస్ కూటమిలో పంచుకున్న సమాచారం ఆధారంగానే ట్రూడో ఆ ఆరోపణలు చేసి ఉండొచ్చని యూఎస్ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జైశంకర్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ఇందుకు ఆయన బదులిస్తూ.. తాను అసలు ఫైవ్ ఐస్‌లో భాగం కాదని, ఎఫ్‌బీఐకి చెందిన వ్యక్తిని కూడా కాదని తెలిపారు. ఈ ప్రశ్న అడగాల్సింది తనని కాదని చెప్పుకొచ్చారు.