AAP Leader : జైలు అధికారులను బెదిరించిన సత్యేందర్ జైన్
ABN , First Publish Date - 2023-01-05T15:14:52+05:30 IST
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) జైలు అధికారులను బెదిరించినట్లు ఫిర్యాదు దాఖలైంది. పదవిలో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన జైలు అధికారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన బెదిరించినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు.
సత్యేందర్ జైన్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) మే 31న ఆయనను అరెస్ట్ చేసింది. ఆయనను తీహార్ జైలులో ఉంచారు. ఆయన తమను బెదిరిస్తున్నారని, దూషిస్తున్నారని, తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారని కొందరు అధికారులు జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసినవారిలో ఏఐజీ ప్రిజన్ (తీహార్ జైల్), సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ (ఎస్‌సీజే-7), డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, తీహార్ జైలు లా ఆఫీసర్ ఉన్నారు.
అసిస్టెంట్ జైల్ సూపరింటెండెంట్ జైదేవ్, డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ డిసెంబరు 8న ఇచ్చిన ఫిర్యాదులో, తాము సత్యేందర్ జైన్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు వెళ్ళినపుడు, ఆయన తమను బెదిరించారని చెప్పారు. జైలులో అనుచితంగా ప్రవర్తించినందుకు సమాధానం చెప్పాలని ఈ నోటీసులను ఇచ్చామని తెలిపారు.
‘‘ఇదంతా చేస్తున్నది లా ఆఫీసర్ అని నాకు తెలుసు. నేను జైలు నుంచి బయటకు వచ్చానంటే, ఆయనను సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని అడుగుతాను. ఎస్‌సీజే-7 రాజేశ్ చౌదరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అతని సంగతి చూస్తాను. ఉద్యోగం ఎలా చేయాలో అతనికి నేర్పిస్తాను. ఇదంతా రాజకీయ విషయం. జైలు నుంచి బయటికొచ్చానంటే, నాకు వ్యతిరేకంగా కుట్రపన్నిన ప్రభుత్వోద్యోగులందరినీ విడిచిపెట్టే ప్రసక్తేలేదు. వాళ్లు ఉద్యోగాలు చేస్తున్నా, రిటైర్ అయినా వదిలిపెట్టేది లేదు’’ అని జైన్ తమను బెదిరించారని తెలిపారు.
ఇదిలావుండగా, సత్యేందర్ జైన్ ఈ జైలులో ప్రత్యేక సదుపాయాలను పొందుతున్నట్లు కనిపించే వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆయన జైలు గదిలోనే మసాజ్ చేయించుకుంటున్నట్లు, ఇతరులతో సమావేశమవుతున్నట్లు, ప్రత్యేకమైన ఆహారాన్ని పొందుతున్నట్లు ఈ వీడియోల్లో కనిపించింది.