Share News

Manipur Violence: ఐదు ప్రశ్నలతో ప్రధాని మోదీని ఇరకాటంలో పడేసిన జైరాం రమేశ్.. ఇంతకీ ఆ ప్రశ్నలేమిటంటే?

ABN , First Publish Date - 2023-10-24T21:03:31+05:30 IST

అక్కడెక్కడో జరుగుతున్న హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకూ చాలాసార్లు స్పందించారు. ఇక్కడి నుంచి మానవతా సహాయం పంపించారు. ఈ సమస్యపై ఆ రెండు దేశాధినేతలతో...

Manipur Violence: ఐదు ప్రశ్నలతో ప్రధాని మోదీని ఇరకాటంలో పడేసిన జైరాం రమేశ్.. ఇంతకీ ఆ ప్రశ్నలేమిటంటే?

అక్కడెక్కడో జరుగుతున్న హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకూ చాలాసార్లు స్పందించారు. ఇక్కడి నుంచి మానవతా సహాయం పంపించారు. ఈ సమస్యపై ఆ రెండు దేశాధినేతలతో చర్చించారు. ఈ వ్యవహారంలో ఎప్పటికప్పుడు చురుకుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. మన దేశంలోని బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల సమస్యలపై కూడా ఆయన గళమెత్తుతున్నారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పడేసేందుకు తన వాక్చాతుర్యాన్ని చాటి చెప్తున్నారు. కానీ.. బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై మాత్రం ఆయన ఇంతవరకూ మాట్లాడింది లేదు. ఆ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఎలాంటి చర్యలూ తీసుకుంది లేదు. మణిపూర్ సంక్షోభంపై మాట్లాడమంటే.. అది మన దేశంలో భూభాగమని, తాను గతంలో చాలాసార్లు ఈశాన్య ప్రాంతాల్ని సందర్శించానని మోదీ చెప్పడం మరింత దురదృష్టకరం. అందుకే.. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూనే ఉంది.


ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్.. ఈ మణిపూర్ సంక్షోభం విషయంలో ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. మే 3వ తేదీన ఆ రాష్ట్రంలో చెలరేగిన సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని, నేటితో 175 రోజులు పూర్తయ్యాయని, కానీ మోదీ మాత్రం ఇప్పటికీ మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఇలాంటి అత్యవసరమైన సమయంలో ప్రధాని మోదీ తమని ఎలా ఒంటరిగా వదిలేశారో మణిపూర్‌తో ఈశాన్య ప్రాంతాల్లోని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. మణిపూర్‌లో హింస చెలరేగి, రాష్ట్రంలో సామాజిక సామరస్యం చెడిపోయి 175 రోజులు అవుతున్నా.. ఈ సంక్షోభాన్ని ప్రధాని మోదీ విస్మరించారని నిప్పులు చెరిగారు. ఈ సంక్షోభాన్ని విస్మరించడం ద్వారా ప్రధాని మోదీ తన జవాబుదారీతనం, బాధ్యత నుంచి తప్పించుకోలేరని అన్నారు. రాష్ట్రంలో సయోధ్య, విశ్వాసాన్ని పెంపొందించే ప్రక్రియ ఊపందుకోవాలని కోరుకునే ప్రజలందరూ.. ప్రభుత్వానికి ఈ ఐదు ప్రశ్నలు అడగాలని పిలుపునిచ్చారు.

ఆ 5 ప్రశ్నలు ఏమిటి?

* ప్రధాని మోదీ ఇంతవరకూ ఎందుకు మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలను కలవలేదు? అక్కడ ఎన్నుకోబడ్డ నాయకుల్లో తన పార్టీకి చెందినవారే కదా!

* లోక్‌సభలో మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎందుకు ప్రధానమంత్రిని కలవలేకపోయారు?

* అన్ని విషయాలపై బోధించే ప్రధాని మోదీకి.. ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తే తప్ప మణిపూర్ అంశంపై 4-5 నిమిషాలకు మించి ఎందుకు మాట్లాడటం లేదు?

* ప్రయాణాలంటే పడి చచ్చే ప్రధాని మోదీకి.. తన ఆందోళన వ్యక్తం చేసేందుకు మణిపూర్‌లో కొన్ని గంటల సమయం గడపలేరా?

* మణిపూర్‌లోని అన్ని వర్గాల ప్రజలచే తిరస్కరించబడిన ముఖ్యమంత్రిని ఇంకా ఆ పదవిలో కొనసాగడానికి ఎందుకు అనుమతిస్తున్నారు?

Updated Date - 2023-10-24T21:03:31+05:30 IST