S Jaishankar: వాళ్లిద్దరి గైర్హాజరితో ఎలాంటి నష్టం లేదు.. గతంలోనూ ఇలాగే రిపీట్ అయ్యింది

ABN , First Publish Date - 2023-09-06T19:02:18+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకావడం లేదన్న విషయం...

S Jaishankar: వాళ్లిద్దరి గైర్హాజరితో ఎలాంటి నష్టం లేదు.. గతంలోనూ ఇలాగే రిపీట్ అయ్యింది

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకావడం లేదన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరి గైర్హాజరిపై తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. పుతిన్, జిన్‌పింగ్ గైర్హాజరి జీ20 సదస్సుపై ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు. గతంలోనూ కొన్ని కారణాల వల్ల దేశాధ్యక్షుడు లేదా ప్రధానులు గ్లోబల్ మీటింగ్‌లకు హాజరు కాని సందర్భాలు ఉన్నాయని.. వారి స్థానాల్లో ప్రతినిధులు వచ్చారని గుర్తు చేశారు.


ఒక మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జయశంకర్ మాట్లాడుతూ.. కొవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు, ఉత్తర-దక్షిణ విభజనలతో పాటు మరెన్నో సమస్యలను ప్రపంచం ఎదుర్కుంటున్న తరుణంలో జీ20 సదస్సుకి భారత్ ఆతిథ్యం వహిస్తోందని అన్నారు. భారత్‌కు నిర్మాణాత్మక ప్లేయర్‌గా పేరుందని, ఈ సమావేశాలకు ప్రతి ఒక్కరూ గంభీరతతో వస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలపై ఈ సమ్మిట్‌లో చర్చించడం జరుగుతుందన్నారు. అయితే.. ఈ మీటింగ్‌లో వెంటనే సమస్యలు పరిష్కారం కావని, అందుకు సమయం పడుతుందన్నారు. ఇది సాధారణంగా జరిగే మంత్రివర్గ సమావేశం లాంటిదని పేర్కొన్నారు.

ప్రపంచం ఎదుర్కుంటున్న సవాళ్లపై ఈ జీ20 సమ్మిట్ మంచి ఫలితాలే ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. ఈరోజు ప్రపంచ నలమూలల్లో ఏదో ఒక సమస్య ఉండనే ఉందని, మరి జీ20 సమ్మిట్ అందుకు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసుకోవడం కోసం యావత్ ప్రపంచం వేచి చూస్తోందన్నారు. ఈ సరికొత్త ప్రపంచంలో సరికొత్త దిశగా భారత్ పయనిస్తోందని.. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా భారత్ సరికొత్త బాధ్యతలు నిర్వహిస్తోందని అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యం పెరగడం వెనుక ఘనత మోదీకి దక్కుతుందని జయశంకర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-06T19:02:18+05:30 IST